అభివృద్ధిపైనే కమ్యూనిస్టు సర్కార్ దృష్టి…సెమీ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు కోసం భూసేకరణ

  • Published By: venkaiahnaidu ,Published On : January 24, 2020 / 05:43 AM IST
అభివృద్ధిపైనే కమ్యూనిస్టు సర్కార్ దృష్టి…సెమీ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు కోసం భూసేకరణ

అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మాత్రమే మిగిలి ఉన్న సమయంలో డెవలప్ మెంట్ ప్రాజెక్టులపై సీరియస్ గా దృష్టి పెట్టింది కేరళ ప్రభుత్వం. యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి ప్రాజెక్టులను,అందులో ముఖ్యంగా సెమీ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు చేపట్టాలని పిన్నరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కార్ కంకణం కట్టుకుంది.

ఈ మేరకు సెమీ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు విషయమై సీఎం పిన్నరయి విజయన్ నేతృత్వంలో రాజధాని తిరువనంతపురంలో గురువారం హై లెవల్ సమావేశం జరిగింది. పబ్లిక్ వర్క్స్ మినిస్టర్ జీ సుధాకరణ్,చీప్ సెక్రటరీ టామ్ జోసె,టాన్స్ పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఆర్ జ్యోతిలాల్,కేరళ రైల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ అజిత్ కుమార్,ఇతరులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో భూసేకరణ వేగవంతంగా జరిగేందుకు భూసేకరణ సెల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

అధికార లెక్కల ప్రకారం…ఈ సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం 1,226 హెక్టార్లు(3,029ఎకరాలు)సేకరించాల్సి ఉంటుంది. అయితే కొత్త లేన్ లో ఈ ప్రాజెక్టు కోసం ప్రస్తుతమున్న రైల్వే లైన్ కి సమాంతరంగా ఉన్న అదనపు భూమిని ఉపయోగించుకునేందుకు రైల్వే మంత్రిత్వశాఖ ఇప్పటికే ఆమోదం తెలిపడంతో ఇంక దాదాపు 200 హెక్టార్ల భూసేకరణ మాత్రమే చేయాల్సి ఉంటుంది. 66వేల కోట్ల ఈ ప్రాజెక్టులో భారతీయ రైల్వే,కేరళ ప్రభుత్వానికి సమాన వాటా కలిగి ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఏజెన్సీలు ఇచ్చే లోన్ తో చేపట్టనున్నారు. 

నిధుల సేకరణ కోసం జర్మన్ బ్యాంక్,ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్,జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషప్ ఏజెన్సీ(JICA)లను ప్రభుత్వం సంప్రదించనుంది. ప్రతిపాదిత సెమీ హైస్పీడ్ రైలు గంటలకు 200కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసేందుకు రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. కేరళ సీఎంవో తెలిపిన ప్రకారం…మరో 5-6 నెలల్లో ఈ ప్రాజెక్టు ప్రారంభమై 2020నాటికి పూర్తి అవుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ప్రత్యక్షంగా,పరోక్షంగా 11వేలమంది ఉద్యోగాలు వస్తాయి.

సెమీ హైస్పీడ్ రైలు కోచ్ లు అన్నీ ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉంటాయి. ఈ సెమీ హైస్పీడ్ రైలు ద్వారా రోడ్లపై ట్రాఫిక్ భారీగా తగ్గిపోతుంది. ఎందుకంటే వందల కిలోమీటర్లు కార్లు,ఇతర వాహనాల్లో గంటల తరబడి ప్రయాణించేకన్నా గంటకు 200కిలీమీటర్ల వేగంతో ప్రయాణించే సెమీ హైస్పీడ్ రైళ్లల్లో ప్రయాణించేందుకు ఎక్కువమంది మొగ్గుచూపుతారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గనుంది. పూర్తిగా సోలార్ ఎనర్జీతో ఈ రైళ్లు నడుస్తాయి.