ఢిల్లీలో ఆప్ V/S గవర్నర్…కేజ్రీ ప్రభుత్వ ఆర్డర్స్ కొట్టేసిన LG

  • Published By: venkaiahnaidu ,Published On : June 8, 2020 / 03:36 PM IST
ఢిల్లీలో  ఆప్ V/S గవర్నర్…కేజ్రీ ప్రభుత్వ ఆర్డర్స్ కొట్టేసిన LG

ఢిల్లీలో మళ్లీ సీఎం కేజ్రీవాల్,లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బైజాల్ మధ్య జగడం మొదలైంది. కేజ్రీవాల్ తీసుకున్న రెండు కోవిడ్-19 ఆర్డర్స్ ను లెఫ్టినెంట్ గవర్నర్ కొట్టిపారేశారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయాలను కేజ్రీవాల్ తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నర్ వ్యవహారంపై ఫుల్ సీరియస్ అయింది. లెఫ్టినెంట్ గవర్నర్ ను బీజేపీ ఓ పావుగా వాడుకుంటుందని ఆప్ విమర్శిస్తోంది. 

అసలేం జరిగింది
దేశ రాజధానిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ ను కేవలం ఢిల్లీ ప్రజల కోసమే రిజర్వ్ చేశామని, కేవలం ఢిల్లీ వాసులకు మాత్రమే రాజధాని హాస్పిటల్స్ లో కోవిడ్-19 ట్రీట్మెంట్ అందిస్తామని… వేరే ప్రాంతాల వారికి రాజధానిలో చికిత్స అందించమని సీఎం కేజ్రీవాల్ ఆదివారం చేసిన ప్రకటనపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. కరోనా రోగులకు ఆస్పత్రి పడకలు సరిపోవడం లేదన్న గందరగోళంపై  కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఢిల్లీలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వారికి కరోనా వస్తే.. వారి పరిస్థితి ఏంటని విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు ఆదేష్ కుమార్ గుప్తా కేజ్రీవాల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు కూడా దిగారు.

ఈ సమయంలో  సీఎం కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సైతం తప్పుబట్టారు. సీఎం ఉత్తర్వులను కొట్టివేస్తూ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని నివసించే వారికి, స్వస్థలాలతో సంబంధం లేకుండా చికిత్స అందించాలని హాస్పిటల్ యాజమాన్యాలను ఆదేశిస్తూ ఆర్డర్ జారీ చేశారు. ఎటువంటి వివక్షత లేకుండా ఢిల్లీలో అందరికీ ట్రీట్మెంట్ అందాలని లెఫ్టినెంట్ గవర్నర్ తన ఆదేశాల్లో తెలిపారు.

అంతేకాకుండా,కేజ్రీవాల్ తీసుకున్న మరో వివాదాస్ప నిర్ణయాన్ని కూడా కొట్టిపారేశారు లెఫ్టినెంట్ గవర్నర్. కేవలం కరోనా వైరస్ రోగలక్షణాలు ఉన్నవారికి మాత్రమే ట్రీట్మెంట్ చేయాలన్న ఆప్ సర్కార్ నిర్ణయాన్ని అనీల్ బైజాల్ కొట్టివేశారు. asymptomatic(రోగం ఉండి రోగలక్షణాలు లేనివాళ్లు)తో సహా ICMR సూచించిన మొత్తం 9కేటగిరీల ప్రజలకు టెస్ట్ లు చేయాలని ఆర్డర్ జారీ చేశారు లెఫ్టినెంట్ గవర్నర్.

స్పందించిన కేజ్రీవాల్

తమ ప్రభుత్వం తీసుకున్న రెండు కోవిడ్-19 ఆర్డర్స్ ను లెఫ్టినెంట్ గవర్నర్ కొట్టివేయడంపై కేజ్రీవాల్ స్పందించారు. గవర్నర్ నిర్ణయం పెద్ద సమస్యను,ఢిల్లీ ప్రజలకు పెద్ద సవాల్ ను సృష్టిస్తుందని కేజ్రీవాల్ అన్నారు.  మేం దేశం మొత్తానికి సేవ చేయాలనేది దేవుడి కోరిక అయి ఉండవచ్చు..ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాం అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కాగా కేజ్రీవాల్ లో కరోనా రోగ లక్షణాలు బయటపడటంతో ప్రస్తుతం ఆయన తన ఇంట్లో సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నారు. మంగళవారం కేజ్రీవాల్ కు కరోనా టెస్ట్ చేయనున్నారు.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర పై బీజేపీ ఒత్తిడి చేస్తోందని,తమ ప్రభుత్వ నిర్ణయాలను కొట్టియేసేలా బీజేపీ లెఫ్టినెంట్ గవర్నర్ పై ఒత్తిడి చేసిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు. ఈ సమయంలో కూడా బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.