Viral Video : కలెక్టర్ కళ్లద్దాలు ఎత్తుకెళ్లిన కోతి..లంచం తీసుకుని తిరిగి ఇచ్చింది
ఉత్తర ప్రదేశ్ లోని మధుర జిల్లాలోని బృందావనంలో జిల్లా కలెక్టర్ కళ్ల జోడును ఒక కోతి ఎత్తుకెళ్లింది. చివరికి కోతి ఫ్రూటీ కూల్ డ్రింక్ ఇచ్చాక అది కళ్లజోడు తిరిగి ఇచ్చింది.

Viral Video : కోతి చేష్టలు భలే చిరాకు తెప్పిస్తుంటాయి. ఇప్పుడంటే మహా నగరాల్లో కొతులు పెద్దగా కనపడటం లేదు కానీ పుణ్యక్షేత్రాల్లో ,కొన్ని గ్రామాల్లో కోతులు చేసే పనులకు జనం దడుచుకుంటున్నారు. చేతిలో వస్తువులు లాక్కెళ్లటం.. తినుబండారాలపై పడి లాక్కోవటం ఇలాంటివి చేస్తూనే ఉంటాయి. ఉత్తర ప్రదేశ్ లోని మధుర జిల్లాలోని బృందావనంలో జిల్లా కలెక్టర్ కళ్ల జోడును ఒక కోతి ఎత్తుకెళ్లింది. చివరికి కోతి ఫ్రూటీ కూల్ డ్రింక్ ఇచ్చాక అది కళ్లజోడు తిరిగి ఇచ్చింది.
బృందావనంలోని బాంకే బిహారీ మందిర్‌కు వెళ్లే వీధిలో జిల్లా కలెక్టర్ నవనీత్ చాహల్, ఇతర అధికారులతో కలిసి వెళుతున్నారు. ఆయన మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతుండగా ఒక కోతి వచ్చి ఆయన భుజం పై కూర్చుంది. ఆయన దానిని అదిలించకుండా అలాగే ఫోన్ మాట్లాడసాగారు. ఇంతలో కలెక్టర్ చూస్తుండగానే కోతి ఆయన జేబులోని కళ్లజోడు తీసుకుని ఎగిరి… ఎదురుకుండా ఉన్న ఇంటి ఇనుప మెట్ల మీద కూర్చుంది.
దీంతో ఒక్క సారిగా ఉలిక్కిపడిన అందరూ కళ్లజోడు కోతి వద్ద నుంచి తిరిగి తీసుకోటానికి ప్రయత్నించారు. అయినా అది తిరిగి ఇవ్వలేదు. పోలీసులు, స్ధానికులు, కలెక్టర్ ఎంత బతిమలాడినా కోతి కళ్లజోడు తిరిగి ఇవ్వలేదు. ఇంతలో పోలీసులు రెండు ఫ్రూటీ ప్యాకెట్లు కోతి వైపు విసిరారు. దీంతో అది కళ్లజోడును కింద పడేసి ఫ్రూటీ ప్యాకెట్లను తీసుకుంది.
దీనిని కొందరూ తమ సెల్ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై యూపీలో ప్రధాన ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘బీజేపీ పాలనలోని దుష్ప్రవర్తనను అధికారులు చూడటం లేదు. దీంతో వారికి కళ్లజోడు అవసరం లేదని భావించిన కోతి దానిని తీసుకుంది’ అని హిందీలో కామెంట్ చేశారు.
बंदर ने सोचा जब भाजपा के शासन में प्रशासन को चश्मा लगाकर भी कुछ नहीं दिखता है तो चश्मे का क्या काम… pic.twitter.com/LlGaC1eD00
— Akhilesh Yadav (@yadavakhilesh) August 21, 2022