13 రాష్ట్రాల్లో 1లక్షకు పైగా యాక్టివ్ కరోనా కేసులు

దేశంలోని 13 రాష్ట్రాల్లో 1లక్షకు పైగా కరోనా యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మంగళవారం(మే-11,2021) తెలిపారు.

13 రాష్ట్రాల్లో 1లక్షకు పైగా యాక్టివ్ కరోనా కేసులు

Health Ministry

Health Ministry దేశంలోని 13 రాష్ట్రాల్లో 1లక్షకు పైగా కరోనా యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మంగళవారం(మే-11,2021) తెలిపారు. ఆరు రాష్ట్రాల్లో 50,000 నుంచి 1లక్ష వరకు యాక్టివ్ కేసులు,17 రాష్ట్రాల్లో 50వేల కన్నా తక్కువ యాక్టివ్ కేసులున్నాయని ఆయన తెలిపారు.

మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో లవ్ అగర్వాల్ మాట్లాడుతూ…మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, గుజ‌రాత్‌, ప‌శ్చిమబెంగాల్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, హ‌ర్యానా, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, బీహార్ రాష్ట్రాల్లో 1 ల‌క్ష‌కు పైగా యాక్టివ్ కేసులు ఉన్న‌ాయని.. ఈ 13 రాష్ట్రాల జాబితాలో 5,93,150 యాక్టివ్ కేసులతో మ‌హారాష్ట్ర మొద‌టి స్థానంలో ఉండ‌గా.. 1,05,104 కేసుల‌తో బీహార్ చివ‌రి స్థానంలో ఉందని తెలిపారు.

దాదాపు 26 రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు 15శాతానికి పైగా ఉందని లవ్ అగర్వాల్ చెప్పారు. ఇందులోని 10 రాష్ట్రాల్లో అయితే పాజిటివిటీ రేటు 25శాతానికి పైగా ఉందన్నారు. 9 రాష్ట్రాల్లో(మహారాష్ట్ర,ఢిల్లీ,ఆంధ్ర‌ప్ర‌దేశ్‌,రాజ‌స్తాన్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌,హ‌ర్యానా,గుజ‌రాత్‌,ఛ‌త్తీస్‌గ‌ఢ్‌,బీహార్)కొత్త కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని తెలిపారు. అయితే, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ‌బెంగాల్‌, ఒడిశా, పంజాబ్‌, అసోం, జ‌మ్ము అండ్ క‌శ్మీర్‌, గోవా, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, పుదుచ్చేరి, మ‌ణిపూర్, మేఘాల‌యా, త్రిపుర‌, నాగాలాండ్‌, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో మాత్రం రోజువారీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ద‌ని ఆరోగ్య‌శాఖ తెలిపారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ మాట్లాడుతూ… జాతీయ పాజిటివిటీ రేటు 21 శాతం ఉందని చెప్పారు. దేశంలో 42 శాతం జిల్లాలు, అంటే 734 లో 310 జిల్లాలు జాతీయ సగటు కంటే ఎక్కువ పాజిటివ్ రేటును నివేదిస్తున్నట్లు చెప్పారు. రోజుకు 16-20 లక్షల కోవిడ్ పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. మే 5 న 19 లక్షలకు పైగా కోవిడ్ పరీక్షలు చేశామని.. ఇది ప్రపంచంలోనే అత్యధికం అని భార్గవ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రాపిడ్ యాంటిజెన్ టెస్టులను పెంచాల్సిన అవసరముందన్నారు. రోగికి ఐదు రోజులు జ్వరం లేని సందర్భంలో ఆసుపత్రి డిశ్చార్జ్ సమయంలో నెగిటీవ్ టెస్ట్ అవసరం లేదని భార్గవ స్పష్టం చేశారు.