ఒకేరోజు 12వేలమందికి ఫైన్ : BMC ఖజానాకు కాసుల వర్షం

ఒకేరోజు 12వేలమందికి ఫైన్ : BMC ఖజానాకు కాసుల వర్షం

Mumbai : coronavirus 12 thousand people fined over no face mask : మాస్క్ పెట్టుకోమంటే పెట్టుకోరు..ఫైన్ మాత్రం కట్టేస్తారు. కరోనా తెచ్చిన ఈ మాస్క్ లు పెట్టుకోవటమంటే జనాలు తెగ చిరాకు పడిపోతున్నారు.దీంతో ఫైన్లు వేస్తే కడతాం గానీ మాస్కులు పెట్టుకోం అంటున్నట్లుగా తయారయ్యారు నగరాల్లోని జనాలు. దీంతో అధికారులు ఫైన్లు వేయటం..జనాలు కట్టేయటంతో ముంబై మున్సిపల్ ఖజానాకు కాసుల వర్షం కురిసింది. ఒకేరోజున ఏకంగా 12వేలమందికి అధికారులు ఫైన్ వేయటంతో బీఎంసీకి రూ.24లక్షలు వసూలయ్యాయి.

కాగా..కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు బీఎంసీ (Brihanmumbai Municipal Corporation)సిబ్బంది చాలా హుషారుగా పని చేస్తున్నారు. దీంట్లో భాగంగా అధికారులు ఒకే రోజు మాస్క్‌ ధరించని 12 వేలకుపైగా మందిని పట్టుకుని రూ.24 లక్షలు జరిమాన వసూలు చేశారు. ఇలా బీఎంసీ సిబ్బంది ఇప్పటి వరకు దాదాపు 68 లక్షల మంది నుంచి రూ.14 కోట్లకుపైనే జరిమాన వసూలు చేయడంతో బీఎంసీ ఖజానాకు కాసుల వర్షం కురిసింది.

కరోనా తీవ్రత భారీ స్థాయికి చేరి తిరిగి రోజురోజుకు తగ్గుముఖం పట్టడం కొంత ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. కానీ, మాస్క్‌ ధరించకుండా పట్టుబడుతున్న కేసులు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో బీఎంసీకి చెందిన ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. కరోనా వైరస్‌ను నియంత్రణలో ఉంచాలంటే ప్రజలు మాస్క్‌ ధరించడం తప్పని సరిచేశారు.

అయినా సరే చాలామంది బాధ్యత మరచి వ్యవహరిస్తున్నారు. మాస్క్ లేకుండా పట్టుబడితే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అధికారులు జనాలకు ముకుతాడు వేసేందుకు బీఎంసీ ఆరోగ్య సిబ్బందితోపాటు క్లీన్‌ అప్‌ మార్షల్స్, అధికారులు, ఫ్లయింగ్‌ స్కాడ్‌లు దాడులు చేస్తున్నారు. ప్రతీరోజు 20–24 వేల మందిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల బీఎంసీ కమిషనర్‌ ఇక్బాల్‌సింగ్‌ చహల్‌ ఆంక్షలు విధించారు. దీంతో దాడులు మరింత ఉధృతం చేశారు.

దీంట్లో భాగంగా ప్రతీరోజు ఐదు నుంచి ఆరు వేల మందిని పట్టుకుని జరిమానా విధించేవారు. ఈక్రమంలో మంగళవారం (డిసెంబర్ 16,2020)రోజంతా దాదర్, మాటుంగా, సైన్, అంధేరీ, గోరేగావ్, మలాడ్‌ తదితర రద్దీ ఉండే ప్రాంతాల్లో తిరిగి మాస్కులు ధరించని 12 వేలకుపైగా జనాలకు జరిమానా విధించారు.

ఒకేరోజు ఇలా భారీ సంఖ్యలో జనాకు జరిమానా విధించడం ఇదే మొదటిసారని బీఎంసీ తెలిపింది. ఇదిలాఉండగా ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 68,38,060 మందిపై చర్యలు తీసుకున్నారు. వీరి నుంచి రూ.14,04,06,200 జరిమాన వసూలు చేసినట్లు బీఎంసీ తెలిపింది.