ప్రతి భారతీయుడికి హెల్త్ కార్డు.. అసలు హెల్త్ కార్డు అంటే ఏమిటి? ప్రయోజనాలు ఏంటి?

  • Published By: naveen ,Published On : August 15, 2020 / 11:56 AM IST
ప్రతి భారతీయుడికి హెల్త్ కార్డు.. అసలు హెల్త్ కార్డు అంటే ఏమిటి? ప్రయోజనాలు ఏంటి?

ఊహించినట్టుగానే దేశ స్వాతంత్ర్య దినోత్సవాన ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. ఎర్రకోట వేదికగా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌(ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రధాని ప్రారంభించారు. దీని కింద ప్రతి భారతీయుడికి ఒక ఐడీ నంబర్‌ను కేటాయించనున్నారు. పూర్తిగా టెక్నాలజీ ఆధారితమైన ఈ మిషన్‌, వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దోహదం చేస్తుందని ప్రధాని తెలిపారు. ప్రతి భారతీయుడి సమగ్ర వైద్య సమాచారం ఆ ఐడీ ద్వారా లభిస్తుందని వెల్లడించారు.



అసలు నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ లక్ష్యం ఏంటి? హెల్త్ కార్డు అంటే ఏమిటి? హెల్త్ కార్డు వల్ల ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడీ ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. ప్రతి ఒక్కరు హెల్త్ కార్డు గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. దాని వివరాలు ఆరా తీస్తున్నారు.

* దేశంలోని ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డు లభిస్తుంది.
* డాక్టర్ లేదా ఫార్మసీకి వెళ్లిన ప్రతిసారి జాతీయ స్థాయిలో ఆ సమాచారం మొత్తం కార్డులో నిక్షిప్తమవుతుంది.
* NDHM ఆయుష్మాన్ భారత్ ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) పరిధిలోకి వస్తుంది.
* ఇది దేశంలో ఆరోగ్య సేవల సామర్థ్యం, పనితీరు, పారదర్శకతను గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
* సమాచారం దుర్వినియోగం కాకుండా చూసేందుకు సంబంధిత వ్యక్తుల ఆరోగ్య వివరాలను వైద్యులు, హెల్త్‌ ప్రొవైడర్లు ఒకసారి మాత్రమే పొందే అవకాశం ఉంది.
* దీనికింద మారుమూల ప్రాంతాలకు కూడా టెలీ మెడిసిన్‌, ఈ- ఫార్మసీలు సేవలు అందనున్నాయి.
* అలాగే ఇతర ఆరోగ్య సంబంధ ప్రయోజనాలు పొందడానికి వీలు కలగనుంది.
* దేశంలో కరోనావైరస్‌ మహమ్మారి విలయ తాండవం కారణంగా టెలీ మెడిసిన్‌, డిజిటల్‌ వైద్య సేవలకు ప్రాముఖ్యత ఏర్పడిన సంగతి తెలిసిందే
* కరోనా సంక్షోభ సమయంలో నేషనల్ హెల్త్ మిషన్ చాలా అవసరం అని ప్రధాని అన్నారు.
* వ్యక్తిగత వైద్య వివరాలు(టెస్టులు, డయాగ్నోస్, చికిత్సలు) డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు.
* అధీకృత వ్యక్తి దేశంలో ఎక్కడి నుంచైనా ఈ సమాచారాన్ని తెలుసుకోగలరు.
* కార్డు హోల్డర్ ఏదైనా చికిత్స చేయించుకున్నా, టెస్టు చేయించుకున్నా వెంటనే ఆ వివరాలు కార్డులో భద్రమవుతాయి.
* చికిత్స కోసం దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన సమయంలో ప్రతిసారి మెడికల్ రికార్డులు, రిపోర్టులను వెంట మోసుకెళ్లే భారం తొలగిపోతుంది.
* హెల్త్ కార్డు ద్వారా డాక్టర్లు సదురు వ్యక్తి మెడికల్ రికార్డులను యాక్సెస్ చేయగలరు.