PM Modi: ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ సమావేశం.. ప్రధాని కార్యాలయంలో ఆ 88 నిమిషాలు ఏం చర్చించారు..

సెప్టెంబర్ 13న ఆయన పదవీ విరమణ చేసినప్పటి నుండి ఆ పదవి ఖాళీగా ఉంది.

PM Modi: ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ సమావేశం.. ప్రధాని కార్యాలయంలో ఆ 88 నిమిషాలు ఏం చర్చించారు..

Updated On : December 10, 2025 / 6:42 PM IST

PM Modi: ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. వీరిద్దరి మధ్య 88 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశం పార్లమెంటు కారిడార్లలో పలు ఊహాగానాలకు దారితీసింది. కేంద్ర సమాచార కమిషన్ (CIC), కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC) వంటి కీలకమైన సెంట్రల్‌ ప్యానళ్ల చీఫ్‌ల ఎంపికపై చర్చించడానికి ఈ సమావేశం జరిగింది. ఈ సంస్థలకు సంబంధించిన నియామకాలను ఖరారు చేయడానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్‌ పాల్గొన్నారు.

నిబంధనల ప్రకారం ప్రధాని నామినేట్ చేసిన ఒక కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నాయకుడు.. సమాచార కమిషన్, ఎన్నికల కమిషన్, విజిలెన్స్ శాఖలోని కీలకమైన అత్యున్నత స్థాయి అధికారుల ఎంపికపై సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. ఈసారి సీనియర్ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. రాహుల్ గాంధీ మధ్యాహ్నం 1 గంటకు ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు, సమావేశం 1.07 గంటలకు ప్రారంభమైందని సమాచారం.

88 నిమిషాల తర్వాత రాహుల్ గాంధీ బయటకు వచ్చారు. ప్రధానితో సమావేశంలో చర్చ కేవలం ప్రధాన సమాచార కమిషనర్ నియామకం గురించి మాత్రమే కాకుండా, 8 మంది సమాచార కమిషనర్లు, విజిలెన్స్ కమిషనర్ నియామకం గురించి కూడా ఉందని వెల్లడైంది. ఈ నియామకాలన్నింటిపై రాహుల్ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారని, లిఖితపూర్వకంగా తన అభ్యంతరాన్ని సమర్పించారని సమాచారం.

సాధారణంగా ఇలాంటి సమావేశాల్లో పాల్గొన్న ప్రతిపక్ష నాయకుల నుండి అభ్యంతరాలు వస్తాయి. ఈసారి ఫలితం భిన్నంగా ఏమీ లేనప్పటికీ, 88 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో ఏం జరిగిందనే దానిపై పార్లమెంటు కారిడార్లలో చర్చ తీవ్రంగా జరిగింది. ప్రస్తుతం కేంద్ర సమాచార కమిషన్ లేదా CICలో ప్రధాన సమాచార కమిషనర్ పోస్టుతో సహా 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. RTI దరఖాస్తుదారులు దాఖలు చేసే ఫిర్యాదులు, అప్పీళ్లపై నిర్ణయం తీసుకుని సమాచారాన్ని విడుదల చేసేది అధికారులే.

సెప్టెంబర్ మధ్యకాలం వరకు హిరలాల్ సమారియా దేశ ప్రధాన సమాచార కమిషనర్‌గా పనిచేశారు. సెప్టెంబర్ 13న ఆయన పదవీ విరమణ చేసినప్పటి నుండి ఆ పదవి ఖాళీగా ఉంది. ఇద్దరు సమాచార కమిషనర్లు ఆనంది రామలింగం, వినోద్ కుమార్ తివారీ విధుల్లో ఉన్నారు.

CIC వెబ్‌సైట్ ప్రకారం 30వేల 838 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 12(3) ప్రకారం, ప్రధాని ఎంపిక కమిటీకి ఛైర్మన్‌గా ఉంటారు. ఇందులో ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని నామినేట్ చేసిన కేంద్ర మంత్రి కూడా ఉంటారు. వారు ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్ల నియామకానికి పేర్లను ఎంపిక చేసి సిఫార్సు చేస్తారు.

Also Read: ఎన్నికల కమిషనర్ల గురించి పార్లమెంట్‌లో 3 ప్రశ్నలు అడిగి దడదడలాడించిన రాహుల్ గాంధీ