Vaccine Supply : అడ్వాన్స్‌ కొట్టు.. ఫైజర్‌ పట్టు!

అడ్వాన్స్‌ చెల్లింపులు జరిపితే బారత్‌కు అవసరమైన వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు తాము సిద్ధమేనని ఫైజర్‌ సంస్థ చెబుతోంది. ఇతర దేశాలకు అమలు చేస్తున్న పద్ధతినే భారత్‌కు కూడా వర్తిస్తుందని తెలిపింది.

Vaccine Supply : అడ్వాన్స్‌ కొట్టు.. ఫైజర్‌ పట్టు!

Pfizer Wants Pre Order Advance Payment For Vaccine Supply

Vaccine Supply Pfizer : కరోనా మహమ్మారి ఇండియాలో విజృంభిస్తున్న వేళ.. వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుకోవాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్‌-వి టీకాలతో పాటు మరిన్ని విదేశీ వ్యాక్సిన్ల దిగుమతికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం ఫైజర్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తోంది. అడ్వాన్స్‌ చెల్లింపులు జరిపితే బారత్‌కు అవసరమైన వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు తాము సిద్ధమేనని ఫైజర్‌ సంస్థ చెబుతోంది. ఇతర దేశాలకు అమలు చేస్తున్న పద్ధతినే భారత్‌కు కూడా వర్తిస్తుందని తెలిపింది.

ఇండియన్ ప్రతినిధుల చర్చలు : –
ఫైజర్‌తో వివిధ దఫాలుగా ఇండియన్‌ ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఫైజర్‌ ప్రతినిధులు ఇదే అంశాన్ని స్పష్టం చేశారు.
అడ్వాన్స్‌ చెల్లింపులు జరిపితేనే వ్యాక్సిన్‌ సరఫరా చేస్తామని తెలిపారు. ఇప్పుడు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది భారత ప్రభుత్వమేనని చెబుతున్నారు. కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంటే తమ సంస్థ తరఫున అత్యంత ఆధునిక టెక్నాలజీని భారత్‌లోని తయారీదారులకు బదలాయించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా అంటున్నారు. వైరస్‌ వేరియంట్లపై పని చేసే విధంగా పరిశోధనతో పాటు వ్యాక్సిన్‌లో మార్పులకు కూడా సహకరిస్తుందని స్పష్టం చేశారు.

భారత్ కు 5 కోట్ల వ్యాక్సిన్ : –
ఈ ఏడాది విడతల వారీగా భారత్‌కు 5 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను విక్రయించేందుకు అమెరికా కంపెనీ ఫైజర్‌ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సంకేతాలు లభించాయి జూలై, ఆగస్టు నెలల్లో చెరో కోటి డోసులు, సెప్టెంబరులో 2 కోట్ల డోసులు, అక్టోబరులో కోటి టీకా డోసులను భారత్‌కు సరఫరా చేయాలని ఫైజర్‌ యోచిస్తోందని పేర్కొన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వంతోనే టీకా విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని ఆ కంపెనీ స్పష్టం చేసిందని భారత వర్గాలు చెప్పాయి.

త్వరలో సమావేశం : –
ఇండెమ్నిటీ బాండ్‌పై భారత్‌ సంతకం చేసిన తర్వాతే ఒప్పందానికి సిద్ధమవుతామని తేల్చిచెప్పిన ఫైజర్‌… అందుకు సంబంధించిన ఫైళ్లను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ శాఖలకు పంపింది. బ్రిడ్జింగ్‌ ట్రయల్స్‌, సెంట్రల్‌ డ్రగ్స్‌ లేబొరేటరీలో వ్యాక్సిన్‌ పరీక్షలు, ఔషధ నియంత్రణ సంస్థల అనుమతులకు సంబంధించిన నిబంధనలను సరళీకరించాలని కూడా ఫైజర్‌ విజ్ఞప్తి చేసిందంటున్నారు. కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌పై ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల బృందం వీలైనంత త్వరగా సమావేశమై ఫైజర్‌ కంపెనీ ప్రతిపాదనలపై తుది నిర్ణయాన్ని తీసుకుంటుందని అంటున్నారు.

అడ్వాన్స్‌లు చెల్లించి టీకాలు : –
ఫైజర్‌ సంస్థ ప్రతినిధులతో సమావేశాలను విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా నిర్వహించారు. వాషింగ్టన్‌ డీసీలోని భారత రాయబార మిషన్‌ ఇందులో కీలక పాత్ర పోషించింది. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. ఆయన అక్కడ ఫైజర్‌ ప్రతినిధులతో టీకాల సరఫరాపై చర్చలు నిర్వహిస్తున్నారు. ఇండియాకు భవిష్యత్‌ అవసరాల కోసం వీలైనంత సహకారం అందించాలని కోరారు. ఐరోపాలోని చాలా దేశాలు, అమెరికా ముందస్తు ఆర్డర్లతో పాటు అడ్వాన్సులు చెల్లించి ఫైజర్‌ టీకాలను పొందుతున్నాయి. అదే విధానాన్ని ఇండియా కూడా అనుసరిస్తే.. సరఫరా చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఫైజర్‌ స్పష్టం చేసింది.

Read More : COVID 19 : తెలంగాణలో కరోనా…24 గంటల్లో 3 వేల 762 కేసులు