కరోనా ఇచ్చిన సందేశం అదే.. ప్రపంచానికే మార్గదర్శకం అయ్యాం: మోడీ

  • Published By: vamsi ,Published On : May 12, 2020 / 03:18 PM IST
కరోనా ఇచ్చిన సందేశం అదే.. ప్రపంచానికే మార్గదర్శకం అయ్యాం: మోడీ

ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం కొనసాగిద్దాం అంటూ మరోసారి పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ పరిణామాలపై జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ.. ఎన్నో మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొన్న భారత్.. కరోనాను దీటుగా ఎదుర్కొంటోందని వెల్లడించారు.

సంక్షోభం కంటే సంకల్పం గొప్పదని, విపత్కర సమయంలో భారత్ సామర్థ్యాన్ని ప్రపంచం గుర్తించిందని అన్నారు. భారత్‌లో తయారైన మెడిసిన్ ప్రపంచానికి వరంగా మారుతుందని అన్నారు. ప్రపంచానికి భారత్ యోగాను కానుకగా ఇచ్చిందని అన్నారు. 

అలాగే 2000 సంవత్సరంలో వై2కే సమస్య వచ్చినప్పుడు యావత్ కంప్యూటర్ ప్రపంచం తల్లడిల్లిపోతే.. భారత నిపుణులు నిబ్బరంగా సమస్యను ఎదుర్కొన్నారని, ప్రపంచానికి దిశా నిర్దేశం చేశారని గుర్తు చేశారు ప్రధాని మోడీ. ఇప్పుడు కూడా మనమే ప్రపంచానికి మార్గదర్శకం అయ్యామని అన్నారు. 

స్వీయ నియంత్రణ ఒక్కటే కరోనా నివారణ మార్గమని.. మహమ్మారిపై పోరాటంలో ఓడిపోవడానికి మనిషి సిద్ధంగా లేడని అన్నారు. బతకాలి, బతికించుకుంటూ ముందుకు సాగాలన్నదే కరోనా వైరస్ ఇచ్చిన సందేశం అని వెల్లడించారు మోడీ.