ఏడు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన ప్రధాని.. కరోనాపై తర్వాతి స్టెప్ ఏంటీ?

  • Published By: vamsi ,Published On : July 20, 2020 / 07:31 AM IST
ఏడు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన ప్రధాని.. కరోనాపై తర్వాతి స్టెప్ ఏంటీ?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం(19 జులై 2020) ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. బీహార్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో మాట్లాడి కరోనా మహమ్మారి, వరదలు తలెత్తే పరిస్థితి గురించి ఆరా తీశారు.

ఇటీవలి కాలంలో, కరోనా వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో పరిస్థితిని ఆరా తీశారు. అదే సమయంలో, దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు మరియు కొండచరియలు విరిగిపడటం వలన పరిస్థితి ఘోరంగా ఉండడంపై విచారించారు.

ఈ సంభాషణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులకు అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సంభాషణ గురించి అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ట్వీట్ చేసి, వరదలు కారణంగా ఏర్పడిన పరిస్థితిని పరిష్కరించడానికి అస్సాంకు అన్ని విధాలా సహాయం అందిస్తామని పిఎం మోడీ హామీ ఇచ్చారని అన్నారు.

దేశంలో ఆదివారం ఒకే రోజులో అత్యధికంగా 38,902 కరోనా కేసులు నమోదయ్యాయి, మొత్తం కేసుల సంఖ్య 10,77,618 గా ఉంది. అయితే, ఈ వ్యాధి నుండి కోలుకుంటున్న వారి సంఖ్య 6,77,422 కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఒక రోజులో వ్యాధి కారణంగా 543 మంది చనిపోగా.. మరణించిన వారి సంఖ్య 26,816 కు పెరిగింది. వరుసగా మూడు రోజులు 30 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదవగా.. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌లలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి.

దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరగడాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దేశంలో దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో కేంద్రానికి తెలియట్లేదు అంటూ విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా లాక్‌డౌన్ ఆర్థిక నష్టాలకు కారణమయ్యింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టాలని చూస్తుంది. కరోనా సంక్షోభానికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రులతో ముఖ్యంగా ఏడు రాష్ట్రాలతో ఎక్కువగా టచ్‌లోకి వెళ్తున్నారు ప్రధాని.