విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై స్పందించిన మోడీ,రాహుల్

  • Published By: venkaiahnaidu ,Published On : May 7, 2020 / 05:36 AM IST
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై స్పందించిన మోడీ,రాహుల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ సిటీలోని ఓ కెమికల్ ఫ్లాంట్ నుంచి గురువారం(మే-7,2020)ఉదయం  విషవాయువు లీక్ అయిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ,హోంమంత్రి అమిత్ షా,కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ,పలువురు కేంద్రమంత్రులు స్పందించారు. విశాఖ వాసులు సేఫ్ గా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు మోడీ తెలిపారు. విశాఖలో పరిస్థితిని దగ్గరగా పరిశీలిస్తున్న MHA,NDMA అధికారులతో పరిస్థితి గురించి తాను మాట్లాడటం జరిగినట్లు మోడీ తెలిపారు.

విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు బాగుండాలని,అందరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు మోడీ ట్వీట్ ద్వారా తెలిపారు.విశాఖలో జరగిన ఘటన కలిచివేసినట్లు హోంమంత్రి అమిత్ షా తెలిపారు. NDMA అధికారులు,సంబంధిత అధికారులతో మాట్లాడామని,తాము కంటిన్యూస్ గా దగ్గరగా పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నట్లు అమిత్ షా ట్వీట్ ద్వారా తెలిపారు.

వైజాగ్ గ్యాస్ లీక్ గురించి విని తాను షాక్ అయినట్లు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తెలిపారు. గ్యాస్ లీక్ వల్ల ఎఫెక్ట్ అయినవాళ్లకు అవసరమైన సపోర్ట్,సాయం అందించాల్సిందిగా విశాఖ ఏరియాలోని కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలను కోరుతున్నట్లు రాహుల్ ట్వీట్ చేశారు. గ్యాస్ లీక్ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హాస్పిటల్ లో ఉన్నవాళ్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి సానుభూతి ప్రకటించారు. అందరి క్షేమం కోరుతూ, బాధితులు త్వరగా కోలుకోవాలని పేర్కొంటూ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. 

లాక్ డౌన్ కారణంగా కొన్ని రోజులుగా మూతపడి ఉన్న విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జి పాలిమర్స్ పరిశ్రమలో గురువారం(మే 7,2020) అర్థరాత్రి తెరుచుకుంది. అయితే ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో….అర్థరాత్రి 2గంటల 45నిమిషాల సమయంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమ నుంచి భారీగా రసాయన వాయువు లీక్ అయ్యింది. పరిశ్రమ నుంచి స్టేరైన్ అనే విష వాయువు లీకైనట్లు తెలుస్తుంది. 3 కిలోమీటర్ల​ మేర గ్యాస్ వ్యాపించింది.

విషవాయువు లీక్ అవడంతో విశాఖ ఉక్కిరిబిక్కరి అయింది. లీకైన రసాయన వాయువు పీల్చడంతో స్థానిక ప్రజలు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో పాటు చర్మంపై దద్దుర్లు వచ్చాయి. కళ్లలో మంటలతో ఇబ్బంది పడ్డారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. క్షణాల్లోనే గాల్లోకి వ్యాపించిన విష వాయువు చుట్టుపక్కల ప్రజల్ని కమ్మేశాయి. కంపెనీ చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాల ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భయాందోళనకు గురైన స్థానికులు ఇల్లు ఖాళీ చేసి మేఘాద్రి గడ్డ డ్యామ్ వైపు పరుగులు తీశారు.

పలుచోట్ల రోడ్లపైనే ప్రజలు కుప్పకూలిపోయారు. 1000 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారిని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. బిల్డింగ్ లపై నుంచి పడిపోయి పలువురికి గాయాలయ్యాయి. ఈ గ్యాస్ లీక్  ప్రమాదం కారణంగా ఇప్పటివరకు 8మంది ప్రాణాలు కోల్పోగా…వందలమంది హాస్పిటల్ లో చేరి ట్రీట్మెంట్ పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. విషవాయువు తీవ్రతను తగ్గించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయకచర్యలు చేపట్టాయి. పరిస్థితి ప్రస్తుతం అదుపులోకి వస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read | విశాఖలో లీక్ అయిన కెమికల్ గ్యాస్ ఇదే, ఎంత డేంజర్ అంటే..