‘టీకా’పై ప్రధాని సమీక్ష, 90 లక్షలు దాటిన కరోనా కేసులు

  • Published By: madhu ,Published On : November 21, 2020 / 04:30 AM IST
‘టీకా’పై ప్రధాని సమీక్ష, 90 లక్షలు దాటిన కరోనా కేసులు

Prime Minister’s review on the vaccine : భారత్ లో కరోనా టీకా పంపిణీ ప్రణాళికను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమీక్షించారు. 2020, నవంబర్ 20వ తేదీ శుక్రవారం ఈ సమీక్ష జరిగింది. టీకా పంపిణీ, ప్రక్రియలో భాగస్వాములను చేయాల్సిన సంస్థలు, టీకాలను మొదట ఇవ్వాల్సిన వారి ప్రాధాన్యత క్రమం..ఇతరత్రా అంశాలపై ఆయన సమీక్ష జరిపారు. వ్యాక్సిన్ అభివృద్ధితో పాటు సేకరణ, నియంత్రణ, నిల్వ మొదలైన ముఖ్యమైన అంశాలను సమావేశంలో చర్చించారు. ఈ మేరకు ప్రధాని మోడీ..ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.





మరోవైపు భారతదేశంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తూనే ఉంది. గత 24 గంటల్లో 45 వేల 882 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90, 04, 365కి చేరుకుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా కొత్తగా 584 మంది చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 1,32,162కి చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య శుక్రవారానికి 84.28 లక్షలకు చేరుకుంది. మొత్తం రికవరీ రేటు 93.6 శాతంగా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 4.92 శాతం ఉండగా..మరణాల శాతం 1.46గా ఉంది.



శీతాకాలానికి తోడు పండగల సీజన్‌ ప్రారంభం కావడంతో దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి నవంబర్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతాయని భావించారు….కానీ మరింత పెరుగుతున్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌, నైట్‌ కర్ఫ్యూ కఠినంగా అమలు చేసే దిశగా ఆలోచన చేస్తున్నాయి. ఇంతకుముందు లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. దీంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్‌డౌన్‌కు బదులు కర్ఫూ వంటి చర్యలు చేపట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.