తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24గంటల్లో 169 కేసులు, 4 మరణాలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు

  • Published By: naveen ,Published On : May 30, 2020 / 02:56 AM IST
తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24గంటల్లో 169 కేసులు, 4 మరణాలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా వందకుపైగా కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. శుక్రవారం(మే 29,2020) రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఏకంగా 169 మంది కరోనా బారిన పడ్డారు. ఈ కేసుల్లో అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి.

169 కేసుల్లో 82 గ్రేటర్ హైదరాబాద్ లోనే:
ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌లోనే 82 కేసులు నమోదయ్యాయని.. రంగారెడ్డిలో 14, మెదక్‌లో ఇద్దరు, సంగారెడ్డి జిల్లాలో ఇద్దరికి వైరస్‌ సోకిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. విదేశాల(సౌదీ అరేబియా) నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో 64 కొత్త కేసులను శుక్రవారమే గుర్తించగా.. మరో ఐదుగురు వలస కార్మికులకు కూడా కరోనా సోకింది. ఇక ఒక్కరోజే కరోనాతో నలుగురు చనిపోయినట్లుగా బులెటిన్‌లో తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 71కి చేరింది. ఇప్పటివరకూ కరోనాతో కోలుకొని 1381 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు రాష్ట్రంలో 973 మంది ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 2425 కేసులు నమోదయ్యాయి. సౌదీ అరేబియా నుంచి రాష్ట్రానికి వచ్చిన 458 మందిలో శుక్రవారం సాయంత్రం నాటికి 207 మందికి పాజిటివ్ తేలింది.

ఒకే రోజు కరోనాతో నలుగురు మృతి:
శుక్రవారం కరోనాతో మరణించిన వారిలో 53ఏళ్ల వ్యక్తి ఉన్నాడు. అతడు గాంధీలో చేరిన 7 రోజుల తర్వాత చనిపోయాడు. 59 ఏళ్ల మరో వ్యక్తి 3 రోజుల తర్వాత, 62 ఏళ్ల వృద్ధుడు 13 రోజుల తర్వాత మరణించాడు. వీళ్లంతా ఇతర జబ్బులతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. హైపర్‌ ‌టెన్షన్‌తో బాధపడుతున్న 60ఏళ్ల వృద్ధురాలు గాంధీలో చేరిన 5 రోజుల తర్వాత మరణించింది.

కరోనా మరణాల్లో చైనాను దాటేశాం:
అటు దేశవ్యాప్తంగా కరోనా అంతకంతకు విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా లక్ష 65వేల 799 మంది కరోనా బారిన పడ్డారు. పాజిటివ్‌ కేసుల్లో ఇంతకుముందే చైనాను దాటిన భారత్‌ తాజాగా మరణాల్లోనూ ఆ దేశాన్ని అధిగమించింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం వరకు 24 గంటల్లో 175 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 4,706కు చేరుకుంది. చైనాలో ఇప్పటి వరకు 4,638 మంది కరోనాతో మరణించారు. మరోవైపు, 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 7,466 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 

కరోనా వెలుగులోకి వచ్చాక ఇదే ఫస్ట్ టైమ్:
దేశంలో కరోనా వైరస్‌ బయట పడిన తర్వాత ఒక్కరోజులో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. మే 22 నుంచి ప్రతిరోజూ 6వేలకు పైగా కేసులు రికార్డయ్యాయి. ఇప్పటి వరకు 71,705 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా మృతుల్లో మహారాష్ట్రలో 1982 మంది, గుజరాత్‌లో 960 మంది ఉన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. చైనాలో ఇప్పటి వరకు 4,638 మంది మరణించగా, 84వేల 106 మందికి వైరస్‌ సోకినట్లు ప్రకటించారు. చైనా కేసులతో పోలిస్తే.. భారత్‌లో నమోదైన పాజిటివ్‌ కేసులు దాదాపు రెట్టింపు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడిన తొలి పది దేశాల్లో భారత్‌ తొమ్మిదో స్థానంలో ఉంది. భారత్‌కంటే ముందు అమెరికా, బ్రెజిల్‌, రష్యా, బ్రిటన్‌, స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ ఉండగా.. తర్వాత టర్కీ 10 స్థానంలో నిలిచింది. వైరస్‌కు పుట్టినిల్లయిన చైనా మాత్రం ఇరాన్‌, పెరు, కెనడా, చిలీ తర్వాత 15వ స్థానంలో ఉంది.

* మన దేశంలో మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. 
* మహారాష్ట్రలో 59వేల 546 కరోనా కేసులు, 1982 మరణాలు. 
* గుజరాత్‌లో 15వేల 562 కరోనా కేసులు, 960 మరణాలు.
* దేశంలో జనవరి 30న తొలి కేసు నమోదైతే మార్చి 13న తొలి కరోనా మరణం సంభవించింది. 
* వంద మరణాలకు చేరుకోవడానికి 24 రోజుల (ఏప్రిల్‌ 6) సమయం పట్టింది. 
* ఆ తర్వాత 13 రోజుల్లో (ఏప్రిల్‌ 19) 500 మంది మరణిస్తే, అటుపై పది రోజులకే (ఏప్రిల్‌ 29) మరణాలు వెయ్యికి చేరుకున్నాయి. 
* 2,000 మరణాలకు చేరుకోవడానికి  11 రోజుల (మే10) సమయం పడితే, తర్వాత ఎనిమిది రోజుల్లో (మే 18) 3,000 మందికి, అటుపై ఏడు రోజులకు (మే 25) 4,000వ మరణం నమోదైంది. 
* ముంబై, ఢిల్లీలతోపాటు కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో దేశవ్యాప్తంగా 30 పట్టణ ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా గుర్తించి కఠిన ఆంక్షలు అమలు చేయాలని కేంద్ర హోంశాఖ సూచన.

60 లక్షలు దాటిన కరోనా కేసులు:
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండం చేస్తోంది. 213 దేశాల ప్రజలను వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 60లక్షల మార్క్ దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 60 లక్షల 29 వేల 646 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 30 లక్షల 3 వేల 738. కోవిడ్‌-19 కారణంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల 66 వేల 792 మంది చనిపోయారు. వ్యాధి నుంచి కోలుకుని 26 లక్షల 59 వేల 116 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా వైరస్‌ కారణంగా అగ్రరాజ్యం అమెరికా అత్యంత ప్రభావానికి గురవుతోంది. కోవిడ్‌-19తో అమెరికాలో నిన్న(మే 29,2020) ఒక్కరోజే 1,225 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు అమెరికాలో మొత్తం లక్ష 4వేల 542 మంది చనిపోయారు. 17 లక్షల 93 వేల 530 మంది కరోనా బారిన పడ్డారు.

కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల వివరాలు:
* బ్రెజిల్‌-27,944
* రష్యా-4,374
* స్పెయిన్‌-27,121
* యూకే-38,161
* ఇటలీ-33,229
* ఫ్రాన్స్‌-28,714
* జర్మనీ-8,594
* టర్కీ-4,489
* ఇరాన్‌-7,677
* పెరూ-4,230
* కెనడా-6,979
* చైనా-4,634
* మెక్సికో-9,415
* పాకిస్థాన్‌-1,317
* బెల్జియం-9,430
* నెదర్లాండ్స్‌-5,931
* ఈక్వెడార్‌-3,334
* స్వీడన్‌-4,350
* పోర్చుగల్‌-1,383
* స్విట్జర్లాండ్-1,919
* ఐర్లాండ్‌-1,645
* ఇండోనేషియా-1,520
* పోలాండ్‌-1,051
* రోమేనియా-1,248

Read: కరోనా కట్టడిపై ఇక రాష్ట్రాలదే నిర్ణయం!