పొలిటికల్ రౌండప్ 2019 : దేశ రాజకీయాల్లో మొదటిసారి జరిగిన విశేషాలు

  • Published By: venkaiahnaidu ,Published On : December 31, 2019 / 10:54 AM IST
పొలిటికల్ రౌండప్ 2019 : దేశ రాజకీయాల్లో మొదటిసారి జరిగిన విశేషాలు

2019లో భారత రాజకీయాల్లో చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా మొదటిసారిగా జరిగిన విశేషాలు చాలానే ఉన్నాయి. అమిత్ షా కేంద్ర హోంమంత్రి అవడం నుంచి ఉద్దవ్ ఠాక్రే సీఎం అవడం దాకా. గతంలో లేని విధంగా మొదటిసారి భారత రాజకీయాల్లో 2019లో జరిగిన విశేషాలను ఇప్పుడు చూద్దాం.

> ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించింది. ప్రతిపక్షాలు ఊహించని విధంగా 353 సీట్లలో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. అయితే మొదటిసారిగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ సొంతంగా 303సీట్లు గెల్చుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మోడీ చరిష్మాతో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించింది బీజేపీ.

>బీజేపీ అధ్యక్షడు అమిత్ షా మొదటిసారి కేంద్రమంత్రివర్గంలో చేరారు. గాంధీనగర్ లోక్ సభ స్థానం నుంచి 5.5లక్షల రికార్డు మెజార్టీ ఓట్లు సాధించి కేంద్రహోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేసి తన సత్తా ఏంటో విపక్షాలకు చూపించాడు.

>దశాబ్దాలుగా మిత్రపక్షంగా కొనసాగుతూ వచ్చిన బీజేపీకి శివసేన గట్టి షాక్ ఇచ్చింది. ఏళ్లుగా రెండు పార్టీల మధ్య కొనసాగుతూ వచ్చిన కోల్డ్ వార్ కాంగ్రెస్,ఎన్సీపీలతో శివసేన చేతులు కలిపేలా చేసింది. మతతత్వ పార్టీగా పేరున్న శివసేనకు మొదటిసారి కాంగ్రెస్ హస్తమందించింది. అంతేకాకుండా ఠాక్రే ఫ్యామిలీ నుంచి మొదటిసారిగా ఉద్దవ్ ఠాక్రే సీఎం అయ్యారు. బీజేపీకి ఒక మిత్రపక్షం దూరమైంది.

>దేశంలో మొదటిసారిగా పూర్తిస్థాయి కేంద్రఆర్థికశాఖ మంత్రిగా పగ్గాలు చేపట్టారు నిర్మలాసీతారామన్. గతంలో ఇందిరాగాంధీ ఆర్థకశాక బాధ్యతలు నిర్వహించినప్పటికీ ఆమె ప్రధానిగా కొనసాగుతూ ఆ బాధ్యతలు నిర్వహించారు. పూర్తిస్థాయిలో ఆర్థికశాఖ బాధ్యతలు చేపట్టిన తొలి భారత మహిళ నిర్మలా సీతారామనే.

>కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తొలిసారిగా దక్షిణాది రాష్ట్రం నుంచి పోటీ చేశారు. కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన రాహుల్4లక్షల 31వేల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే పోటీ చేసిన రెండో స్థానమైన యూపీలోని అమేథీలో రాహుల్ ఓడిపోయాడు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాహుల్ మొదటి ఓటమి కూడా ఇదే.

> కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో రాహుల్ పోటీ చేసిన అమేధీలో ఆయనను ఓడించి తొలిసారిగా లోక్ సభలో అడుగుపెట్టారు స్మృతీ ఇరానీ. కాంగ్రెస్ కంచుకోట అమేథీలో రాహుల్ ఓటమి,స్మృతీ విజయం గాంధీ ఫ్యామిలీకి గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పవచ్చు.