102ఏళ్లలో…ఈ సెప్టెంబర్ లోనే భారత్ లో అత్యధిక వర్షపాతం

  • Published By: venkaiahnaidu ,Published On : September 30, 2019 / 04:25 AM IST
102ఏళ్లలో…ఈ సెప్టెంబర్ లోనే భారత్ లో అత్యధిక వర్షపాతం

102సంవత్సరాలలో భారత్ లో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇంకా నెల పూర్తి అవడానికి ఒకరోజు మిగిలి ఉండగానే ఆదివారం(సెప్టెంబర్-29,2019)నాటికి మొత్తం భారతదేశ సగటు వర్షపాతం 247.1మిల్లీ మీటర్లగా,సాధారణం కంటే 48% ఎక్కువ, భారతదేశ వాతావరణ శాస్త్రంలో మూడవ అత్యధికంగా నమోదైందని 1901నుంచి వర్షపాతం రికార్డ్ చేస్తున్న భారత వాతావరణశాఖ(IMD) తెలిపింది. 102 ఏళ్లలో అత్యంత తేమగా ఉండే సెప్టెంబర్ ను భారత ప్రజలు ఈ ఏడాది చూశారని తెలిపింది. 

ఇప్పటికే భారీ వర్షాల కారణంగా గుజరాత్,బీహార్ రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో ఇవాళ(సెప్టెంబర్-30,2019)1983 సెప్టెంబర్ నాటి 255.8మిల్లీమీటర్ల వర్షపాతంను ఈ ఏడాది సెప్టెంబర్ దాటి పోతుందని తెలిపింది. గడిచిన నాలుగురోజుల్లో కురిసిన భారీ వర్షాలకు దేశవ్యాప్తంగా 140మంది వరకు చనిపోయారు. చనిపోయినవారిలో అత్యధికులు ఉత్తరప్రదేశ్ కు చెందినవారున్నారు.

గురువారం(సెప్టెంబర్-26,2019)నుంచి కురిసిన భారీ వర్షాలకు యూపీలో 79మంది చనిపోరని ప్రభుత్వం తెలిపింది. బీహార్ లో గడిచిన 48గంటల్లో 13మంది చనిపోయారు. బీహార్ లో భారీ వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్థంభించిపోయింది.19ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి