Social media: సోషల్‌ మీడియాపై నిబంధనలు.. రేపటి నుంచి అమల్లోకి!

Social media: సోషల్‌ మీడియాపై నిబంధనలు.. రేపటి నుంచి అమల్లోకి!

Social Media Giants Yet To Comply With Government Rules As Deadline Ends Today

New Rules in Social media: భారత్‌లో సోషల్‌ మీడియాపై నిబంధనల కత్తి వేలాడుతోంది. దిగ్గజ సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ కేంద్రం చర్యలకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. సోషల్‌ మీడియా కట్టడికి ఈ ఏడాది ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వం కొత్త నియమావళి రూపొందించింది. ఈ రూల్స్‌ రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఆ మార్గదర్శకాల్లో సూచించిన విధంగా ఏర్పాట్లు చేసుకోవడానికి సామాజిక మాధ్యమాలకు, ఓటీటీలకు మే 25 దాకా సమయం ఇచ్చింది. అయితే ఆ గడువు నేటితో ముగియనుంది.

ఓటీటీ, డిజిటల్ న్యూస్‌ మాధ్యమాలకు సంబంధించిన సమాచారం వెల్లడించాలని కేంద్రం గతంలో ఆదేశాలిచ్చింది. ఓటీటీ మాద్యమాల్లో మూడు అంచె వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ తప్పనిసరని చెప్పకపోయినా.. వాటి సమాచారాన్ని మాత్రం ఇవ్వాలని చెప్పింది కేంద్రం.

కేంద్ర నియమావళి ప్రకారం.. అన్ని రకాల సామాజిక మాధ్యమాలూ తమతమ ప్లాట్‌ఫామ్‌లపై పోస్ట్‌ అయ్యే సమాచారం విషయంలో అత్యంత జాగరూకతతో ఉండాలి. అలాగే.. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ఒక అధికారిని నియమించాలి. ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా అధికారి ఆ విషయాన్ని వారికి తెలియజేయాలి. అంతేకాదు 15 రోజుల్లోగా పరిష్కరించాలి.

సోషల్‌ మీడియా సంస్థలు చట్టాలు, నిబంధనల ప్రకారం నడుచుకునేలా చూడడం కోసం చీఫ్‌ కంప్లయన్స్‌ అధికారిని నియమించాలని కూడా కేంద్రం నిబంధనల్లో పొందుపర్చింది. పోలీసులు, సీబీఐలాంటి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలకు 24 గంటలూ అందుబాటులో ఉండేలా నోడల్‌ కాంటాక్ట్‌ పర్సన్‌ను కూడా నియమించాలని చెప్పింది. ఫిర్యాదుల పరిష్కారాల కోసం రెసిడెంట్‌ గ్రీవన్స్‌ అధికారిని నియమించాలని… వీరంతా భారత్‌లో నివసించేవారై ఉండాలి సూచించింది.

ఇలాంటి మరికొన్ని నిబంధనలను కూడా కేంద్రం విధించింది. కానీ.. ఆ నిబంధనల ప్రకారం భారతదేశానికి చెందిన ఒక్క కూ సంస్థ తప్ప మిగతా ప్రముఖ సామాజిక మాధ్యమాలు అలాంటి అధికారులను నియమించలేదు. ఈ నిబంధనల అమలుకు ప్రభుత్వం మూడు నెలల సమయమిచ్చినా చర్యలు చేపట్టలేదు. పైగా తమకు ఆరు నెలల సమయం కావాలని అడుగుతున్నాయి. అయితే ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో.. ఆయా సంస్థలపై చర్యలకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమువుతన్నట్లు తెలుస్తోంది.