దేశంలో లాక్ డౌన్ పై మోడీ క్లారిటీ

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులు,మరణాల సంఖ్య భారీగా నమోదవుతుంది.

దేశంలో లాక్ డౌన్ పై మోడీ క్లారిటీ

Pm Modi Lockdown

PM Modi దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులు,మరణాల సంఖ్య భారీగా నమోదవుతుంది. రికార్డు స్థాయిలో రోజుకి 2లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. కరోనా సెకండ్ వేవ్ తుఫానులా వచ్చి పడిందని ప్రధాని అన్నారు. భారత్ మరో అతిపెద్ద సవాల్ ఎదుర్కొంటోందని మోడీ అన్నారు. కోవిడ్ తో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తనకు తెలుసని ప్రధాని పేర్కొన్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. మొదటి వేవ్ సమయంలో అందరూ ధైర్య సాహసాలు ప్రదర్శించారని..ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో ఎవ్వరూ ధైర్యాన్ని కోల్పోకూడదన్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని..ఓ కుటుంబసభ్యుడిగా ఈ విషయం చెబుతున్నానని మోడీ అన్నారు.

ఈ సారి కరోనా విపత్తులో ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నామన్నారు. దేశంలో ఆక్సిజన్ కు డిమాండ్ చాలా ఎక్కువగా ఉందన్నారు. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు,ప్రైవేటు కంపెనీలు కృషి చేస్తున్నాయన్నారు. కరోనా కేసులు పెరిగినప్పటికీ మందుల తయారీ కూడా భారీ ఎత్తున జరుగుతోందన్నారు. ఔషధాల ఉత్పత్తిలో మరింత వేగవంతమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఫార్మా కంపెనీలతో చర్చలు జరిపామన్నారు. ఔషధాల ఉత్పత్తిని పెంచడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. మనకు అధ్భుతమైన ఫార్మారంగం ఉందని ప్రధాని తెలిపారు. వ్యాక్సిన్ అఫ్రూవల్స్, రెగ్యులేటరీ వ్యవస్థలను వేగవంతం చేశామన్నారు.

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఆసుపత్రులలో బెడ్స్ సంఖ్యను పెంచే పని జరుగుతోందన్నారు. కొన్ని పట్టణాల్లో డిమాండ్ కు అనుగుణంగా ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోయినసారి కరోనా విశృంఖలంగా ఉన్నప్పుడు మన సంస్థలు రాత్రిపగలూ కష్టపడి వ్యాక్సిన్ రూపొందించాయన్నారు. ఈ చర్యల వల్ల రెండు మేడిన్ ఇండియా వ్యాక్సిన్లను తీసుకురాగలిగామన్నారు. ఇప్పటి వరకు, 12 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించామన్నారు. దేశంలో మే-1నుంచి 18ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మన దగ్గర వ్యాక్సిన్ తక్కువ ధరకు లభిస్తోందన్నారు.

లాక్ డౌన్ పై అపోహలు,భయాలు వదిలిపెట్టాలన్నారు. లాక్ డౌన్ ను రాష్ట్రాలు.. చివరి అస్త్రంగానే ప్రయోగించాలని..మైక్రో కంటైన్మెంట్ జోన్లపై దృష్టి పెట్టాలని సూచించారు. దేశాన్ని లాక్ డౌన్ నుంచి కాపాడాలని ప్రధాని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు..కార్మికులు సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోకుండా ఉన్న చోట ఉండాలని కోరాలని తాను రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నానన్నారు. కార్మికులకు రాష్ట్రాలు ఇచ్చే ఈ నమ్మకం వారికి సహాయపడుతుంది మరియు వారు ఉన్న నగరంలో వారికి వ్యాక్సిన్ లు వేస్తారని మోడీ తెలిపారు.