Teeka Utsav : వ్యాక్సిన్లు లేకుండా..టీకా ఉత్సవ్ ఎలా..మోడీకి లేఖాస్త్రాలు

దేశ వ్యాప్తంగా నేటి నుంచి టీకా ఉత్సవ్‌ ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు.. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా.. 45 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం ఆదేశాలిచ్చింది.

Teeka Utsav : వ్యాక్సిన్లు లేకుండా..టీకా ఉత్సవ్ ఎలా..మోడీకి లేఖాస్త్రాలు

Teeka

COVID-19 Cases : దేశ వ్యాప్తంగా నేటి నుంచి టీకా ఉత్సవ్‌ ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు.. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా.. 45 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేలా కేంద్రం యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేసింది. ఒక్క టీకాతోనే మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోగలమని.. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా టీకా పంపిణీని ముమ్మరం చేయాలని చూస్తోంది కేంద్రం.

మోదీకి లేఖాస్త్రాలు : –
టీకా మహోత్సవ్‌.. కేంద్రం ఆర్భాటంగా చేపట్టాలనుకుంటున్న ఈ కార్యక్రమానికి ఎదురుదెబ్బ తగిలింది. వ్యాక్సినేషన్‌కు మేము రెడీగానే ఉన్నాం కానీ.. కొంచెం వ్యాక్సిన్‌లు ఇప్పించండి అంటూ ప్రధాని మోదీకి లేఖలు రాస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు వెల్లువెత్తున్నాయి.. కరోనా కట్టడిపై సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా.. 2021, ఏప్రిల్ 11వ తేదీ ఆదివారం నుంచి మూడు రోజుల పాటు టీకా ఉత్సవ్‌ నిర్వహించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. కానీ.. గ్రౌండ్ లెవల్‌లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉంది. మీరిచ్చిన ఆదేశాలను ఆచరణలో పెట్టాలంటే.. తగినన్ని వ్యాక్సిన్లు సరఫరా చేయాలంటూ ప్రధాని మోదీకి లేఖాస్త్రాలు సంధిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు..

పెరుగుతున్న కేసులు : –
దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలంతా వ్యాక్సినేషన్‌ సెంటర్ల బాట పడుతుండటంతో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో వ్యాక్సిన్లు నిండుకుంటున్నాయి. దీంతో వ్యాక్సిన్లు లేకుండా టీకా ఉత్సవ్‌ ఎలా నిర్వహించాలని ప్రశ్నిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. టీకా ఉత్సవ్‌లో వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ వేయాలన్నది లక్ష్యం. కానీ, ఇదే తీరుగా వ్యాక్సిన్‌ కొరత కంటిన్యూ అయితే.. కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలని రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రానికి లేఖలు రాస్తున్నాయి.

సీఎంలు లేఖలు : –
టీకా ఉత్సవ్‌ నిర్వహించాలంటే.. అర్జంట్‌గా 30 లక్షల డోసుల్ని అందించాలని తెలంగాణ సర్కార్‌.. మాకు కూడా 25 లక్షల టీకాల్ని పంపించాలంటూ ఏపీ సర్కార్‌ ప్రధానికి లేఖ రాశాయి. మహారాష్ట్ర కూడా తమకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు అవసరం ఉందని కోరుతోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా కేంద్రాన్ని వ్యాక్సిన్‌ కోసం అభ్యర్థించారు. ఒడిశాలో ఇప్పటికే వ్యాక్సిన్‌ స్టాక్‌ లేకపోవడంతో వ్యాక్సినేషన్‌ కేంద్రాలు మూతపడ్డాయని.. తమకు పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్లు కావాలని అడుగుతోంది. కేరళ సీఎం పినరయి విజయన్‌ కూడా మోదీకి లేఖ రాశారు..

ఒత్తిడిలో ఉన్నామన్న సీరం : –
వ్యాక్సిన్‌ కొరతపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం ప్రధానిని ప్రశ్నించారు. టీకా మహోత్సవం చేయడం కాదని.. ముందు అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ చేయాలని.. విదేశాలకు ఎగుమతి ఆపేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే.. అసలు దేశంలో వ్యాక్సిన్‌ కొరత లేదంటున్నారు కేంద్ర మంత్రులు. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడిలో తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి కేంద్రంపై విమర్శలు చేస్తున్నాయని మండిపడుతున్నారు. వ్యాక్సిన్ల ఉత్పత్తి విషయంలో తాము తీవ్ర ఒత్తిడిలో ఉన్నామంటూ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదర్‌ పూనావాలా ప్రకటించారు. ఆయన అలా ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత నుంచే వ్యాక్సిన్‌ కొరత వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మొత్తంగా.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతమవ్వాలంటే.. రాష్ట్రాలకు సరిపడా వ్యాక్సిన్లు సరఫరా చేయాల్సిందే అన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Read More : viral : భార్య పెట్టిన లంచ్ బాక్సుని ఆఫీసులో అమ్మేస్తున్న భర్త..