చిల్లర విలువ తెలిసేలా చేసిన రోజు: నరేంద్ర మోడీ సంచలన ప్రకటనకు మూడేళ్లు

  • Published By: vamsi ,Published On : November 8, 2019 / 01:58 AM IST
చిల్లర విలువ తెలిసేలా చేసిన రోజు: నరేంద్ర మోడీ సంచలన ప్రకటనకు మూడేళ్లు

దేశవ్యాప్తంగా సంచలనం.. ఇటువంటి ఓ సంచలన నిర్ణయం ప్రభుత్వాలు తీసుకుంటాయి అనే ఊహ కూడా ఎవరికీ లేదు. కానీ నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పడిన తొలి ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. 500, 1000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది కేంద్రం. అవినీతిపై పోరాడేందుకు, నల్లధనం సమస్యలు తీర్చేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఇది అని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడి.

2016 నవంబరు 8 అర్థరాత్రి నుంచి మొదలుకొని అన్ని 500, 1000 రూపాయల నోట్లు చట్టబద్ధమైన మారక విలువను కోల్పోయినట్లు ప్రకటించారు మోడీ. ఆ రోజు సాయంత్రం జాతిని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ దీనిని ప్రకటించారు. ఉగ్రవాదులకు ఆర్థిక వనరుగా మారిన దొంగనోట్ల మాఫియాను, దేశంలోని నల్లధనాన్ని దెబ్బతీసేందుకు 500, వెయ్యి నోట్లను రద్దు చేశారు. ఈ క్రమంలోనే కొత్త 500, 2వేల రూపాయల నోట్లను చెలామణిలోకి తెచ్చింది ప్రభుత్వం.

నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకటించి సరిగ్గా నేటికి మూడేళ్లు.. ఆపైన డిసెంబరు 31 వరకూ సరైన గుర్తింపు ద్వారా బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో 500,  వెయ్యి రూపాయల నోట్లను మార్చుకునే అవకాశం ఇచ్చారు. తనకు 50 రోజులు గడువు ఇవ్వాలని ప్రజలను కోరిన ప్రధాని, డిసెంబర్ 30 తర్వాత నా తప్పు ఉందని తేలితే, మీరు నన్ను ఏ చౌరస్తాలోనైనా నిలబెట్టి, శిక్ష విధించండి అంటూ ధైర్యంగా ప్రకటన చేశారు.

నగదు రహిత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ సమాజంపై వైపు ఇదొక పెద్ద ముందడుగు అని అప్పుడు వెల్లడించారు మోడీ. ప్రతిపక్షాలు మాత్రం ఇప్పటికీ నోట్ల రద్దు ఫెయిల్ అని చెబుతుంది. మోడీ ప్రభుత్వం మాత్రం నోట్లు రద్దు చేసిన ఉద్దేశాలన్నీ నెరవేరినట్లు చెబుతోంది.

అయితే ఈ నిర్ణయంతో ఎంతోమందికి చిల్లర విలువ తెలిసింది. వందనోటుకు వందనాలు పెట్టారు. ఏటీఎమ్‌ల వద్ద క్యూలు కట్టారు. ఇప్పటికి కూడా ఎవరూ ఆ రోజులు మర్చిపోలేరు కదా? ఈ నిర్ణయంతో 86శాతం పాత నోట్లు చలామణి కాకుండా పొయ్యాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరిగాయి.