Union Minister Arrested :సీఎం ఉద్ధవ్ పై అనుచిత వ్యాఖ్యలు..కేంద్రమంత్రి అరెస్ట్

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యల కేసులో మంగళవారం(ఆగస్టు-24,2021) కేంద్రమంత్రి నారాయణ్​ రాణెను ముంబై పోలీసులు అరెస్ట్​ చేశారు.

Union Minister Arrested :సీఎం ఉద్ధవ్ పై అనుచిత వ్యాఖ్యలు..కేంద్రమంత్రి అరెస్ట్

Minister

Union Minister Arrested మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యల కేసులో మంగళవారం(ఆగస్టు-24,2021) కేంద్రమంత్రి నారాయణ్​ రాణెను ముంబై పోలీసులు అరెస్ట్​ చేశారు. బీజేపీ చేపట్టిన జన్​ ఆశీర్వాద్​ కార్యక్రమం కోసం రాష్ట్రంలో పర్యటిస్తున్న రాణెను రత్నగిరి ప్రాంతంలో అరెస్ట్ చేసిన పోలీసులు..ఆయనను సంగమేశ్వర్​ పోలీస్​స్టేషన్​కు తరలించారు. అయితే అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నానని రాణె చెప్పగా..డాక్టర్లను పిలిపించి టెస్ట్ లు చేయించారు పోలీసులు. కాగా,గత 20 ఏళ్లలో అరెస్ట్ అయిన తొలి కేంద్రమంత్రి రాణె కావడం గమనార్హం.

అంతకుముందు.. పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కోసం రాణె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అరెస్ట్​ నుంచి రక్షణ కల్పించాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు కేంద్ర మంత్రి. తనపై నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ను కొట్టివేయాలని అభ్యర్థించారు. పిటిషన్​పై మంగళవారమే అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా రాణె తరఫున న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. న్యాయవాది అభ్యర్థనను తిరస్కరించిన జస్టిస్​ ఎస్​ఎస్​ శిండే, జస్టిస్​ ఎన్​జే జమాదర్​తో కూడిన ధర్మాసనం.. సరైన ప్రక్రియను అనుసరించాలని ఆదేశించింది. తొలుత.. రిజిస్ట్రీ విభాగంలో అత్యవసర విచారణకు దరఖాస్తు చేసుకోవాలని, ఆ తర్వాత పిటిషన్​పై విచారణ చేపట్టాలా? వద్దా? అన్న విషయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఇక, తనకు అత్యవసర బెయిల్ ఇవ్వాలని కోరుతూ రత్నగిరి కోర్టుని రాణే ఆశ్రయించగా..బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.

అసలేం జరిగింది
సోమవారం రాయ్‌గ‌ఢ్ జిల్లాలో కేంద్రమంత్రి నారాయ‌ణ్ రాణె జ‌న్ ఆశీర్వాద్ యాత్ర నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కేంద్రమంత్రి రాణె మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం ఏ ఏడాదిలో వ‌చ్చిందో ముఖ్య‌మంత్రి ఉద్దవ్ ఠాక్రేకి తెలియ‌క‌పోవ‌డం సిగ్గు చేటు. ఉద్దవ్ ఠాక్రే తన ఆసగ్టు-15 ప్ర‌సంగం సంద‌ర్భంగా ఇది ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవమో క‌నుక్కొని మ‌రీ చెప్పారు. ఒక‌వేళ నేను(రాణె) అక్క‌డే ఉండి ఉంటే.. ఆయ‌న‌(ఉద్దవ్ ఠాక్రే)ని లాగిపెట్టి కొట్టేవాడిని అని అన్నారు. అయితే రాణె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

రాణే వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన కార్యకర్తలు,నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల శివసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ రోజు ఉదయం ముంబైలోని రాణె ఇంటి వద్దకు చేరుకున్న శివసేన సభ్యులు జెండాలు పట్టుకుని రాణెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండు గ్రూపులు రాళ్లు కూడా విసురుకున్నారు. ఇక,నాసిక్‌లోని బీజేపీ కార్యాలయంపై శివసేన కార్యకర్తలు రాళ్లురువ్వారు. శివసేన కార్యకర్తల ఫిర్యాదుతో రాణెపై.. పూణెలో ఒక ఎఫ్ఐఆర్,నాసిక్ లో ఒక ఎఫ్ఐఆర్,రాయగఢ్ జిల్లాలోని మహద్ ఏరియాలో రెండు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.

మాజీ సీఎం ఫడ్నవీస్
నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్యలకు తమకు ఏం సంబంధం లేదన్నట్లుగానే బీజేపీ వ్యవహరిస్తోంది. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు నారాయణ్ రాణే సంయమనం పాటించాల్సిందన్నారు. స్వాతంత్ర్య సంవత్సరాన్ని సీఎం మర్చిపోయారనే అంశంపై తన కోపాన్ని ప్రదర్శించిన రాణె.. దానిని మరింత మెరుగైన రీతిలో వ్యక్తం చేయగలిగి ఉండాల్సిందన్నారు. కానీ ఇది జరగదలేదన్నారు.