శశికళ రీ ఎంట్రీ ఇస్తారా?

శశికళ రీ ఎంట్రీ ఇస్తారా?

Shashikala a political re-entry : అవినీతి, అక్రమాస్తుల కేసులో జైలుపాలై ఇటీవలే విడుదలైన తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ ఆసుపత్రి నుంచి ఆమె డిశ్చార్జి అయ్యారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో వేడి రాజుకుంటోంది. బెంగళూరులోని విక్టోరియా హాస్పటల్‌ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌తో చిన్నమ్మ అభిమానుల్లో సందడి నెలకొంది. ఈ నెల 27 బెంగళూరు పరప్పన అగ్రహారం జైలు నుంచి విడుదలయ్యారు శశికళ. 2017లో అవినీతి కేసులో అరెస్ట్‌ అయి నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన శశికళ.. ఈ నెల 20 అనారోగ్యానికి గురయ్యారు.

శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన శశికళకు కరోనా టెస్ట్ చేస్తే పాజిటివ్‌ నిర్థారణ అయ్యింది. దీంతో ఓ వైపు చికిత్స కొనసాగుతుండగానే.. జైలు అధికారులు..శశికళ విడుదలకు కావాల్సిన ఏర్పాట్లన్నిటినీ ఆసుపత్రి నుంచే పూర్తిచేశారు. అయితే జైలు నుంచి విడుదలైనా ఆసుపత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. పది రోజుల చికిత్సకు కోలుకున్న శశికళకు ప్రస్తుతం ఎలాంటి కోవిడ్‌ లక్షణాలు లేవు. మూడు రోజులుగా అయితే ఆక్సిజన్‌ లేకుండా శ్వాస తీసుకుంటున్నారు. దీంతో డిశ్చార్జి చేయాలని నిర్ణయించారు డాక్టర్లు.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగానే శశికళ ఎక్కడికెళ్తారు.? నేరుగా చెన్నై వెళతారా? లేకపోతే బెంగళూరులోనే ఉంటారా? ఇప్పుడిదే ప్రశ్న శశికళ అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది. అయితే వైద్యుల హోం క్వారంటైన్ సూచన మేరకు బెంగళూరులోనే కొన్ని రోజులు ఉండాలని శశికళ కూడా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. శశికళ మేనల్లుడు దినకరన్‌ ఇప్పటికే ఒక అపార్ట్‌మెంట్‌ను బెంగళూరులో సిద్ధం చేశారని, అందులో అన్ని సదుపాయాలూ ఉన్నాయని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కలగం కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. దీనిని బట్టి చూస్తే ఫిబ్రవరి మొదటివారంలో చెన్నై వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

జయలలిత మరణించాక తమిళనాట అధికార అన్నాడీఎంకే విభేదాలు రచ్చకెక్కాయి. పన్నీర్‌సెల్వం ఎదురుతిరగడంతో.. పళనిస్వామిని తెరపైకి తెచ్చారు శశికళ. సీఎం అయ్యాక పళనిస్వామి కూడా ఎదురుతిరగడంతో శశికళ రాజకీయ భవిష్యత్తు అంధకారమైంది. జైలు జీవితం ముగించుకున్న శశికళలో ఈ ఏడాది మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. తమిళ రాజకీయాల్లో శశికళ రీ ఎంట్రీ ఉంటుందో లేదోననే చర్చ..కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. నాలుగురోజుల క్రితం జైలు విడుదలైన శశికళ ఎలాంటి వ్యూహరచన చేయనున్నారు? ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండనున్నాదనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.

శశికళ చెన్నై చేరుకున్నాక తమిళ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకోవడం ఖాయమనే వాదనా వినిపిస్తోంది. అయితే వీటన్నిటినీ కొన్ని రోజుల క్రితమే కొట్టిపారేశారు సీఎం పళనిస్వామి. అన్నాడీఎంకేలో ఆమెకు నో ప్లేస్‌ అని ఖరాఖండీగా చెప్పేశారు. దీంతో 63 ఏళ్ల శశికళ క్రియాశీల రాజకీయాల్లో ఎలా నెగ్గుకొస్తారనేది ప్రశ్నార్థకమవుతోంది. అన్నిటికీ మించి ఒక కేసులో దోషిగా నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించడంతో.. ప్రత్యక్ష ఎన్నికల్లో నాలుగేళ్ల పాటు పోటీ చేసేందుకు అనర్హురాలుగా పరిగణిస్తారు.

దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా…రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఎక్కువగా ఇష్టపడతారని పొలిటికల్‌ సర్కిళ్లలో ఓ వాదన వినిపిస్తోంది. తాననుకున్నది సాధించే పంతంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో జట్టుకడతారని చర్చా జరిగింది. కానీ వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు కొనసాగుతుందని నిన్ననే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రకటన చేసేశారు. దీంతో.. శశికళ రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయనేదానిపై ఇప్పటికైతే అంతుచిక్కట్లేదు.