కామారెడ్డిలో బైక్‌ల సంత గురించి తెలుసా

  • Published By: madhu ,Published On : February 23, 2020 / 10:12 AM IST
కామారెడ్డిలో బైక్‌ల సంత గురించి తెలుసా

మనకు సంత మార్కెట్‌ అనగానే వారంలో ఒక రోజు జరిపే కూరగాయల సంత గుర్తుకు వస్తుంది. అమ్మకందారులు, కొనుగోలుదారులు ఒకచోటకు వచ్చి  కూరగాయలు, పూలు, పండ్లు  క్రయవిక్రయాలు చేస్తుంటారు.  అలాగే పశువుల సంతలు, మేకల సంతలు ఉంటాయి. ఈ సంత మార్కెట్లతోనే బట్టలు, దుస్తులు, గృహోపకరణాలు, నిత్యావసరాలు విక్రయిస్తుంటారు. కానీ బైక్‌లు, కార్లు క్రయవిక్రయాలకు సంతలు జరగడం గురించి ఎక్కడా కనీవిని ఉండరు. కామారెడి జిల్లా కేంద్రంలో బైక్‌లు, కార్ల అమ్మకాలు, కోనుగోళ్లకు సంత జరుపుతున్నారు. 

కామారెడ్డిలో ప్రతి గురువారం బైక్‌ల సంత జరుగుతుంది. ఒక సంవత్సరం కాదు.. రెండు సంవత్సరాలు కాదు.. ఏడేళ్ల నుంచి ఈ మార్కెట్‌ జరుపుతున్నారు. తమ బైక్‌లను అమ్మాలనుకున్నవారు.. తక్కువ ధరలకు మోటారు వాహనాల కొనాలనుకున్న వారు ఇక్కడకు వస్తారు. బైక్‌ల సంత కోసం కామారెడ్డి మున్సిపాలిటీ లీజు ప్రాతిపదికపై కొంత స్థలం కేటాయించింది. ఆ స్థలం చాకపోవడంతో పక్కనే ఉన్న సీఎస్‌ఐ చర్చ స్థలంలో గురువారం బైక్‌ మార్కెట్‌ జరుపుతున్నారు. ప్రారంభంలో అందరూ ఇదేం మార్కెట్‌, సంతలో ఎవరైనా బైక్‌లు, కార్లు అమ్ముతారా.. కొంటారా అనుకునేవారు. మొదటి ఒకరిద్దరు అమ్మకాదారులు, నలుగురైదుగురు కొనుగోలుదార్లు వచ్చేవారు. వివాదాలు, మోసాలకు ఆస్కారం లేకుండా క్రయవిక్రయాలు జరగడంతో కామారెడ్డి బైక్‌ల సంత జనాదరణకు నోచుకుంది. తర్వాత కాలంలో యాభై, అరవై బైక్‌లు వచ్చేవి.  బైక్‌ల సంతపై నమ్మకం పెరగడంతో ఇప్పుడు వందల వాహనాలు వస్తున్నాయి. 

కామారెడ్డి బైక్‌ల సంతలో ప్రతి గురువారం లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రారంభంలో వేలలోనే జరిగేది. అమ్మకానికి పెట్టిన వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను క్షణ్ణంగా పరిశీలిస్తారు. లోన్లు, ఫైనాన్స్‌ డాక్యుమెంట్లను చూస్తారు. పోలీసు ఫైన్లు, చలానాల వివరాలను పరిశీలిస్తారు. అన్ని క్లియర్‌గా ఉంటేనే క్రయవిక్రయాలను అనుమతి ఇస్తారు. సంత నిర్వాహకులు నామమాత్రపు ఫీజు తీసుకుంటారు. భారీ దోపిడీ లేకపోవడంతో ఇటు అమ్మకందారులు, అటు కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదటి కామారెడ్డి పరిసర గ్రామాలకు చెందిన వారే ఇక్కడకు వచ్చేవారు. బైక్‌ల సంత బాగా ప్రాచుర్యం పొందడంతో ఇప్పుడు నిజామాబాద్‌, సిద్దిపేటి, సిరిసిల్ల, కరీనంగర్‌, జగిత్యాలతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనుంచి అమ్మకందారులు, కొనుగోలుదార్లు వస్తున్నారు. 

బైక్‌ల క్రయవిక్రయాల ఏజెంట్‌గా పనిచేసిన బాబా ఈ సంత మార్కెట్‌ను నడుపుతున్నారు. గుర్తింపు కార్డు ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నారు. నమ్మకంగా లావాదేవీలు జరపడంతోనే తమ సంతపై ప్రజలకు నమ్మకం పెరిగిందని నిర్వాహకుల్లో ఒకరైన నారా గౌడ్‌ చెప్పారు. వారం వారం క్రయవిక్రయాలు పెరుగుతున్నాయన్నారు. సామాన్యులకు అందుబాటులో ధరల్లో బైక్‌లు అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు సంతోషిస్తున్నారు. ఒక వారం తమకు కావాల్సిన బైక్‌ లేకపోతే మరోవారం వచ్చి నచ్చిన వాహనాన్ని సొంతం చేసుకుంటున్నారు. కామారెడ్డి సంతకు వచ్చే వారిలో  ఎవరైనా సరే దొంగిలించిన బైక్‌లను అమ్మకానికి పెడితే..అంతే సంగతులు. కటకటాల లెక్కపెట్టాల్సిందే. సంత నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చి అక్రమార్కులను పట్టిస్తున్నారు.