“నా ఒత్తిడిని కంట్రోల్ చేసేది అతడే”.. అంటూ ఆ క్రికెటర్‌ని ఓ రేంజ్‌లో పొగిడిన శుభ్‌మన్ గిల్
"మా మధ్య మంచి అవగాహన ఉంది. అతనితో కలిసి బ్యాటింగ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఈ టోర్నమెంట్‌లో అతడు అద్భుత ప్రదర్శన చేశాడు" అని అన్నాడు.

Shubman Gill
Shubman Gill: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించి కప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దాయాది పాకిస్థాన్‌తో జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచి, తొమ్మిదోసారి ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచింది.
దీనిపై టీమిండియా స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “మా ప్రణాళిక చాలా స్పష్టంగా ఉంది. చివరి వరకు ప్రశాంతంగా ఆడాలి. లక్ష్యం చిన్నదైనా, పవర్‌ప్లేలో వికెట్లు కోల్పోవడం ఒత్తిడిని పెంచింది. కానీ సంజూ, తిలక్ ఎంతో ధైర్యంగా బ్యాటింగ్ చేశారు. దూబే కొట్టిన సిక్స్‌లు మ్యాచ్‌ను మలుపు తిప్పాయి. చివరి 3 ఓవర్లలో 30 పరుగులు కావాల్సి వచ్చినా, మాకు ఎలాంటి టెన్షన్ లేదు. మా ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించి విజయం సాధించారు” అని గిల్ వివరించాడు.
అభిషేక్ శర్మపై గిల్ ప్రశంసలు
తన ఓపెనింగ్ పార్ట్‌నర్ అభిషేక్ శర్మ గురించి గిల్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. “ఈ విజయం చాలా ప్రత్యేకం. టోర్నమెంట్ అంతా ఓటమి లేకుండా ముందుకు సాగడం గొప్ప విషయం. నేను, అభిషేక్ చాలా ఏళ్లుగా కలిసి క్రికెట్ ఆడుతున్నాం.
మా మధ్య మంచి అవగాహన ఉంది. అతనితో కలిసి బ్యాటింగ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఈ టోర్నమెంట్‌లో అతను అద్భుత ప్రదర్శన చేశాడు. నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో నేను ఉన్నప్పుడు ఒత్తిడిని తగ్గించేది అతనే” అంటూ గిల్ అభిషేక్‌పై ప్రశంసలు కురిపించాడు.
కాగా, 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 19.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. యువ సంచలనం తిలక్ వర్మ (53 బంతుల్లో 69 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. కీలక సమయంలో శివమ్ దూబే (33), సంజూ శాంసన్ (24) తిలక్‌కు చక్కని సహకారం అందించారు.