KT Rama Rao : మళ్లీ వచ్చేది మేమే, కేసీఆరే సీఎం, కాంగ్రెస్-బీజేపీకి ఆ దమ్ముందా?- మంత్రి కేటీఆర్

KT Rama Rao : కాంగ్రెస్, బీజేపీలు 75 ఏళ్లల్లో చేయని పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 9ఏళ్లలోనే చేసి చూపించిందన్నారు. కాంగ్రెస్, బీజేపీల పరిపాలన కొత్త సీసాలో పాత సారా మాదిరి ఉంటుందన్నారు.

KT Rama Rao : మళ్లీ వచ్చేది మేమే, కేసీఆరే సీఎం, కాంగ్రెస్-బీజేపీకి ఆ దమ్ముందా?- మంత్రి కేటీఆర్

KT Rama Rao

KT Rama Rao – BRS : తెలంగాణలో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ అయిపోతున్నాయి. వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా కసరత్తు చేస్తున్నాయి. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి అధికారంలోకి వచ్చేది మేమే అని అటు, ఇటు బీజేపీ కాన్ఫిడెంట్ గా చెబుతున్నాయి. అదేమీ లేదు.. ముచ్చటగా మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేది మేమే అంటోంది అధికార బీఆర్ఎస్. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై మంత్రి కేటీఆర్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఎన్ని సీట్లు వస్తాయి, కాబోయే సీఎం ఎవరు అనేదానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో మరోసారి గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. 90 నుంచి 100 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ తెలిపారు. నిధులు, నీళ్లు, నియామకాల స్ఫూర్తికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. మీడియాతో చిట్ చాట్ లో పలు కీలక అంశాలు వెల్లడించారు కేటీఆర్.

Also Read..Kishan Reddy : లక్షలాది మంది చేరుతున్నారు, తెలంగాణలో బలపడుతోంది- కిషన్ రెడ్డి

సమగ్ర, సమతుల్య, సమ్మిళిత అభివృద్ధిని సాధించామన్నారు. విద్య, వైద్య రంగంలో అద్భుతమైన మార్పులు తీసుకురాగలిగామన్నారు. కొత్త పాఠశాలలు, గురుకులాల ఏర్పాటు, మన ఊరు-మన బడి వంటి కార్యక్రమాల ద్వారా విద్యా రంగంలో గుణాత్మకమైన మార్పు సాధ్యమైందన్నారు కేటీఆర్. దేశంలో ఎక్కడా లేనంత వేగంగా తెలంగాణలో పరిపాలన సంస్కరణలు అమలవుతున్నాయని, అన్ని రంగాల్లో తెలంగాణ తనదైన ముద్ర వేయగలిగిందన్నారు.

తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుందన్నది ఈరోజు నినాదంగా మారిందని కేటీఆర్ అన్నారు. ఇదే స్ఫూర్తితో ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేసే విధంగా ఆలోచన చేస్తున్నామని, ఇప్పటికే మహారాష్ట్ర, ఏపీలో పార్టీ కార్యక్రమాలు ప్రారంభించామని కేటీఆర్ వెల్లడించారు. తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ము బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఉందా? అని కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో తమతో పోటీ పడే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామన్నది కాంగ్రెస్ పార్టీ భ్రమే అన్నారు.

Also Read..KA Paul : అధికారంలోకి వస్తే.. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలు- కేఏ పాల్ సంచలనం

ఇక, బీజేపీ.. తెలంగాణలోనే లేదన్నారు కేటీఆర్. అయితే, అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం కాస్త హంగామా చేస్తుంటారని ఎద్దేవా చేశారాయన. రాష్ట్రంలో షర్మిల, కేఏ పాల్ అధికారంలోకి వస్తామని చెప్పడం వారిది కూడా భ్రమే అన్నారు కేటీఆర్.

ఇక కేంద్రంలోని మోదీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు 75 ఏళ్లల్లో చేయని పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 9ఏళ్లలోనే చేసి చూపించిందన్నారు. కాంగ్రెస్, బీజేపీల పరిపాలన కొత్త సీసాలో పాత సారా మాదిరి ఉంటుందన్నారు.

మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను పక్క రాష్ట్రాల్లో పొగిడి ఇక్కడ ఎందుకు విమర్శలు చేస్తున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ప్రశ్నించారు కేటీఆర్. ఎన్ని సీట్లలో పోటీ చేస్తారన్నది ఎంఐఎం ఇష్టం అన్నారు. ప్రజలు మత ప్రాతిపదికన ఓట్లు వేస్తారనేది తాను నమ్మను అన్నారు. మంచి ప్రభుత్వాన్ని, మతాలకు అతీతంగా ఎన్నుకుంటారని తాను నమ్ముతానని కేటీఆర్ పేర్కొన్నారు.