శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు కుట్ర

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు కుట్ర

minister peddi reddy fires on chandrababu naidu: ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ చీఫ్ చంద్రబాబు తీరుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

తిరుపతిలో నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబును రేణిగుంట ఎయిర్ పోర్టులో పోలీసులు నిలువరించడంపై టీడీపీ నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన మంత్రి… చంద్రబాబును ఎవరూ అరెస్ట్ చేయలేదని, ఆయనకు ఎలాంటి అవమానం జరగలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు చేస్తానన్న దీక్ష నిబంధనలకు విరుద్ధమని అన్నారు. ఓవైపు కరోనా ఆంక్షలు, మరోవైపు ఎన్నికల కోడ్ వల్ల దీక్ష చేపట్టడం కుదరదని చెప్పారు.

కరోనా ఆంక్షలు, ఎన్నికల కోడ్‌ వల్లే చంద్రబాబును రేణిగుంట ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కొవిడ్‌, ఎన్నికల నిబంధనలతో పర్యటన కుదరదంటూ పోలీసులు ఆయనకు ముందే చెప్పారన్నారు. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని తెలిసినా కేవలం శాంతిభద్రతల సమస్య సృష్టించి ప్రజలను ఆకట్టుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆరోగ్యరీత్యా చంద్రబాబు వెంటనే వెనుదిరిగి వెళ్లిపోవాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. ఈ పరిస్థితుల్లో పోలీసులను చంద్రబాబు ఇబ్బంది పెట్టొద్దని కోరారు.

ఎయిర్ పోర్టులో బైఠాయించిన చంద్రబాబు తన నిరసనను కొనసాగిస్తున్నారు. ఆయన్ను తిరిగి హైదరాబాద్‌ పంపేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మధ్యాహ్నం 3.10 గంటలకు స్పైస్‌జెట్‌ విమానంలో పంపేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ అక్కడి నుంచి కదిలేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో సాయంత్రం 7.15 గంటలకు ఇండిగో విమానంలో హైదరాబాద్‌ పంపేందుకు పోలీసులు మరోసారి టికెట్లు బుక్‌ చేశారు.