Vinod Kumar : కేసీఆర్‌ను రావొద్దని ఎందుకు చెప్పారు? ప్రధాని మోదీపై వినోద్ కుమార్ ఫైర్

కేసీఆర్ అన్నా తెలంగాణ అన్నా ప్రధాని మోదీకి ఇష్టం లేదు. Vinod Kumar

Vinod Kumar : కేసీఆర్‌ను రావొద్దని ఎందుకు చెప్పారు? ప్రధాని మోదీపై వినోద్ కుమార్ ఫైర్

Vinod Kumar Slams PM Modi

Vinod Kumar – PM Modi : తెలంగాణ పర్యటనలో సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ఆరోపణలు, విమర్శలపై తీవ్రంగా స్పందించారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. కేసీఆర్ ను ఉద్దేశించి ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తమకు ఎవరితోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారాయన. తాము ఎన్డీయేలోకి వెళ్తామన్న ప్రతిపాదనను ఇన్నాళ్లూ మోదీ ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలోనే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందని ప్రధాని మోదీని నిలదీశారు వినోద్ కుమార్.

కోవిడ్ సమయంలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కనుగొన్న తర్వాత ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చారని, అప్పుడు ఆయన ప్రధానమంత్రి కార్యాలయమే స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను రావొద్దని చెప్పారని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. అలా ఎందుకు అన్నారో దానికి జవాబు చెప్పాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. కేసీఆర్ అంటే మోదీకి ఇష్టం లేదని వినోద్ కుమార్ అన్నారు. అసలు జీహెచ్ఎంసీ ఎన్నికలకు, మోదీ పర్యటనకు ఏం సంబంధం అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. కేసీఆర్ గురించి మోదీ ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? అని నిలదీశారు.

Also Read..Telangana Politics: చుట్టం చూపుగా తెలంగాణకు వచ్చి అబద్దాలు.. మోదీపై మండిపడ్డ కేటీఆర్

”మోదీవి జుమ్లా మాటలు అనేది ఇప్పుడు నిరూపితమైంది. మోదీకి తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ అంటే కూడా ఇష్టం లేదు. మోదీ వచ్చి చూస్తానంటే కేసీఆర్ ఎందుకు వద్దంటారు?” అని వినోద్ కుమార్ ప్రశ్నించారు.

”జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తుకు బీఆర్ఎస్ యత్నించిందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు నీటి మాటలే. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్ కు.. ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలుసు. రాష్ట్రం సాధించాక ఏ పార్టీతోనూ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదని ఎప్పుడో చెప్పాము. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు వరకు కేసీఆర్ స్వాగతం పలికారని, పొత్తు వద్దనే సరికి కేసీఆర్ ముఖం చాటేశారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ఎన్నికల వేళ ప్రధాని మోదీ మాట్లాడే మాటలే ఇవి. భారత్ బయోటెక్ కు ప్రధాని మోదీ వచ్చినప్పుడు.. కేసీఆర్ ను రావొద్దని పీఎంవో ఎందుకు చెప్పింది?” అని వినోద్ కుమార్ అడిగారు.

”ఆటో, ట్రక్ గుర్తుల వల్ల మా పార్టీకి ఇబ్బంది కలిగిన విషయాన్ని ECకి ఫిర్యాదు చేశాము. మా కారు గుర్తును పోలిన గుర్తులు ఎవరికీ కేటాయించవద్దని కోరాము. సోషల్ మీడియాలో వ్యక్తులపై అసభ్యకరమైన ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయపరమైన విమర్శలు ఓకే. కానీ వ్యక్తిగత విమర్శలు అపాలని విజ్ఞప్తి చేశాము. ఓటర్లలో డివిజన్ తెచ్చే ప్రయత్నం కొందరు చేస్తున్నారనే విషయాన్ని EC దృష్టికి తీసుకెళ్ళాము.

Also Read..Telangana Politics: కేసీఆర్ అంత మాటన్నారా? మోదీ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల ఖర్చు అనేది ఒకే రేటు పెట్టాలని సూచించాము. పాత ఎన్నికల ఖర్చు 20లక్షలు పెంచాలని కోరాము. ఎన్నికల నియమ నిబంధనలు తెలుగులో పెట్టాలని ఈసీని కోరాము. ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికలకు బీఆర్ఎస్ సహకరిస్తుందని ఈసీకి తెలిపాము. ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు పూర్తి పవర్ ఇవ్వాలని కోరాము. రాజకీయాల్లో ఓడిపోయే పార్టీలు అనేక విమర్శలు చేస్తాయి. 2009, 2004లో మాకు అధికారం ఉన్నదా?” అని వినోద్ కుమార్ ప్రశ్నించారు.