IPL2022 MI Vs LSG : మళ్లీ ఓడిన ముంబై.. వరుసగా 6వ పరాజయం.. లక్నో ఘన విజయం

ముంబై ఇండియన్స్ రాత మారలేదు. వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. వరుసగా 6వ మ్యాచ్ లోనూ..

IPL2022 MI Vs LSG : మళ్లీ ఓడిన ముంబై.. వరుసగా 6వ పరాజయం.. లక్నో ఘన విజయం

Ipl2022 Mi Vs Lsg

IPL2022 MI Vs LSG : ఐపీఎల్ 2022 సీజన్ 15లో ముంబై ఇండియన్స్ రాత మారలేదు. వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. వరుసగా 6వ మ్యాచ్ లోనూ ముంబై ఇండియన్స్ ఓటమి చవిచూసింది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో ముంబై పరాజయం పాలైంది. లక్నో నిర్దేశించిన 200 పరుగుల టార్గెట్ ను ఛేదించలేకపోయింది.

200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 181 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్(31), సూర్యకుమార్ యాదవ్(37) రాణించారు. తిలక్‌ వర్మ (26), కీరన్‌ పొలార్డ్‌ (25) పర్లేదనిపించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (6), ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (13), ఫేబియన్‌ అలెన్‌ (8), జయదేవ్ ఉనద్కత్‌ (14), మురుగన్‌ అశ్విన్‌ (6) పరుగులు చేశారు.(IPL2022 MI Vs LSG)

లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. జేసన్ హోల్డర్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, మార్కస్ స్టోయినిస్ తలో వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీతో కదంతొక్కాడు. ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కు.. ఈ సీజన్ అస్సలు కలిసిరాలేదు. రోహిత్ సేన ఆడిన 6 మ్యాచుల్లోనూ పరాజయం పాలైంది. అటు.. లక్నో 6 మ్యాచులు ఆడగా.. 4 విజయాలు నమోదు చేసింది.

IPL 2022: ముంబై ఇండియన్స్ కథ ముగిసినట్లేనా..

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు భారీ స్కోర్ చేసింది. దీనికి కారణం కేఎల్ రాహుల్. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, డాషింగ్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ముంబైతో మ్యాచ్ లో చెలరేగిపోయాడు. అద్భుతంగా ఆడి సెంచరీ సాధించాడు. ముంబై బౌలర్లను ఊచకోత కోసిన రాహుల్ 60 బంతుల్లో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 9 ఫోర్లు, 5 సిక్సులున్నాయి.

ఐపీఎల్ లో ఇది కేఎల్ రాహుల్ కు 100వ మ్యాచ్ కావడం విశేషం. తన వందో మ్యాచ్ లో వంద పరుగులతో చిరస్మరణీయం చేసుకున్నాడు. అంతేకాదు, ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ కు ఇది మూడో సెంచరీ. ఇక టీ20 లీగ్‌లో 99 మ్యాచ్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ (3405) ఘనత సాధించాడు. రాహుల్ కంటే క్రిస్‌ గేల్ (3578) ముందున్నాడు.

రాహుల్ సెంచరీ సాయంతో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 24, మనీష్ పాండే 38, స్టొయినిస్ 10, దీపక్ హుడా 15 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు పడగొట్టాడు. మురుగన్ అశ్విన్, ఫాబియెన్ అలెన్ తలో వికెట్ తీశారు.

Harbhajan Singh: “మిగిలిన వాళ్లంతా లస్సీ తాగడానికి వెళ్లారా.. “

జట్ల వివరాలు:

లక్నో : కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), డికాక్, మనీశ్‌ పాండే, దీపక్‌ హుడా, మార్కస్ స్టొయినిస్‌, ఆయుష్ బదోని, జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్య, దుష్మంత చమీర, అవేశ్‌ ఖాన్, రవి బిష్ణోయ్

ముంబై : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్‌ కిషన్‌, డేవిడ్ బ్రెవిస్, తిలక్ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్, కీరన్ పొలార్డ్, ఫాబియన్‌ అలెన్, జయ్‌దేవ్ ఉనద్కత్, మురుగన్ అశ్విన్, బుమ్రా, మిల్స్‌