సచిన్.. హషీం ఆమ్లాలను వెనక్కి నెట్టి ప్రపంచరికార్డు కొట్టేసిన రోహిట్ శర్మ

సచిన్.. హషీం ఆమ్లాలను వెనక్కి నెట్టి ప్రపంచరికార్డు కొట్టేసిన రోహిట్ శర్మ

రోహిత్ శర్మ మరో రికార్డును కొట్టేశాడు. రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఓపెనర్‌గా 7వేల పరుగులను అత్యంత వేగంగా చేసిన ఘనత సాధించాడు. ఈ మైలు రాయిని రోహిత్ 137ఇన్నింగ్స్ లలోనే చేధించడం గమనార్హం. క్రికెట్ దిగ్గజం ఈ మైలురాయిని చేరుకోవడానికి 160ఇన్నింగ్స్ లు తీసుకుంటే దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లాకు ఇది సాధించడానికి 147ఇన్నింగ్స్ లు పట్టింది. 

ఓపెనర్‌గా ఏడు వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో ప్లేయర్ గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేందర్ సెహ్వాగ్ అతనికంటే ముందు జాబితాలో నిలిచారు. ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో రాణించలేకపోయిన రోహిత్ రాజ్‌కోట్‌లో దూకుడుగా ఆడుతుండగా ఆడం జంపా బౌలింగ్‌లో 42పరుగులు చేసి వెనుదిరిగాడు. 

దీంతో పాటు రోహిత్‌కు మరో ఘనత దక్కింది. వన్డే ఫార్మాట్‌లో 9వేల పరుగులు చేశాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా కెరీర్ ఆరంభించిన రోహిత్.. 2013ఛాంపియన్స్ ట్రోఫీలో ధోనీ కెప్టెన్సీలో ఓపెనర్‌గా ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోకుండా అతని హవా కొనసాగుతోంది. 

‘ఓపెనర్ గా బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడం నా జీవితాన్ని మలుపు తిప్పేసింది. ధోనీ చెప్పిన మాట బాగా పనికొచ్చింది. అప్పటి నుంచి ఇంకా బెటర్ బ్యాట్స్‌మన్ అయ్యా. నా గేమ్ బాగా అర్థం చేసుకునేందుు బాగా కుదిరింది. పరిస్థితులకు తగ్గట్లు ఆడగల్గుతున్నా’ అని రోహిత్ ఒక సందర్భంలో ఓపెనర్ గా తన ఇన్నింగ్స్ గురించి చెప్పాడు.