IPL 2023 : నేను బౌలింగ్ చేసుంటే.. 40 ప‌రుగుల‌కే రాజ‌స్థాన్ ఆలౌట్ : విరాట్ కోహ్లి

రాజ‌స్థాన్‌పై ఘ‌న విజ‌యం సాధించిన త‌రువాత డ్రెస్సింగ్ రూమ్‌లో బెంగ‌ళూరు ప్లేయ‌ర్స్ సంబ‌రాలు ఎలా చేసుకున్నారో తెలియ‌జేస్తూ ఓ వీడియోను ఆర్‌సీబీ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో కోహ్లి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

IPL 2023 : నేను బౌలింగ్ చేసుంటే.. 40 ప‌రుగుల‌కే రాజ‌స్థాన్ ఆలౌట్ : విరాట్ కోహ్లి

Virat Kohli

Virat Kohli: జైపూర్ వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌(Rajasthan Royals )తో ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bangalore) ఘ‌న విజ‌యం సాధించింది. కెప్టెన్ డుప్లెసిస్‌(55), గ్లెన్ మాక్స్‌వెల్‌(54)లు అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించ‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్ల న‌ష్టానికి 171 పరుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో రాజ‌స్థాన్ 59 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆర్‌సీబీ బౌల‌ర్ల‌లో వేన్ పార్నెల్ 3 వికెట్లు తీయ‌గా, బ్రేస్ వెల్, కర్ణ్ శ‌ర్మ చెరో రెండు, మాక్స్‌వెల్‌, సిరాజ్‌లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇది మూడో అత్య‌ల్ప స్కోరు కావ‌డం గ‌మ‌నార్హం. ఆర్‌సీబీ 112 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ గెలుపుతో బెంగ‌ళూరుకు రెండు పాయింట్లు రావ‌డంతో పాటు నెట్ ర‌న్‌రేట్ మెరుగుప‌డింది. దీంతో ఆర్‌సీబీప్లే ఆఫ్స్ ఆశ‌లు మ‌రింత స‌జీవంగా ఉండ‌గా రాజ‌స్థాన్ అవ‌కాశాలు సంక్లిష్టం అయ్యాయి. బెంగ‌ళూరు ఆట‌గాళ్ల‌కు ఈ విజ‌యం నూత‌నోత్సాహాన్ని ఇచ్చింది. మ్యాచ్ అనంత‌రం డ్రెస్సింగ్ రూమ్‌లో బెంగ‌ళూరు ప్లేయ‌ర్స్ సంబ‌రాలు ఎలా చేసుకున్నారో తెలియ‌జేస్తూ ఓ వీడియోను ఆర్‌సీబీ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో నేను గ‌నుక బౌలింగ్ చేసి ఉంటే రాజ‌స్థాన్ 40 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యేదంటూ కోహ్లి అన్నాడు. కోహ్లి చేసిన ఈ కామెంట్ వైర‌ల్‌గా మారాయి. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

విరాట్ కోహ్లి ఐపీఎల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 235 మ్యాచులు ఆడాడు. బ్యాటింగ్‌లో 36.40 యావ‌రేజ్‌తో 129.29 స్ట్రైక్ రేట్‌తో 7,062 ప‌రుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచ‌రీలు, 50 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి బౌలింగ్ చేశాడ‌న్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. మొత్తంగా 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 2008లో 2 వికెట్లు, 2011లో మ‌రో రెండు వికెట్లు కోహ్లి తీశాడు. 2017 నుంచి ఒక్క‌బంతి కూడా విరాట్ వేయ‌లేదు.

5 స్థానంలో బెంగ‌ళూరు

ఈ సీజ‌న్‌లో రాజ‌స్థాన్‌తో మ్యాచ్ క‌లిపి ఆర్‌సీబీ 12 మ్యాచ్‌లు ఆడింది. 6 మ్యాచుల్లో విజ‌యం సాధించ‌గా మ‌రో ఆరింటిలో ఓట‌మి చ‌విచూసింది. మొత్తంగా 12 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో కొన‌సాగుతోంది. మ‌రో రెండు మ్యాచ్‌లు స‌న్‌రైజ‌ర్స్‌, గుజ‌రాత్‌తో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లో గెల‌వ‌డంతో పాటు మిగిలిన జ‌ట్ల స‌మీక‌ర‌ణాలు అనుకూలిస్తే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.