గ్రేటర్‌ ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ దృష్టి….గెలుపు కోసం వ్యూహాలు

  • Published By: bheemraj ,Published On : November 17, 2020 / 07:29 AM IST
గ్రేటర్‌ ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ దృష్టి….గెలుపు కోసం వ్యూహాలు

CM KCR ‌ Focus on GHMC‌ Elections : తెలంగాణ సీఎం కేసీఆర్‌ గ్రేటర్‌ ఎన్నికలపై దృష్టి సారించారా? బల్దియాలో మరోసారి గులాబీ జెండా ఎగరేసేందుకు పొలిటికల్‌ స్ట్రాటజీ రెడీ చేస్తున్నారా? దుబ్బాక ఫలితం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారా? జీహెచ్‌ఎంసీలో విజయానికి కేసీఆర్‌ రచిస్తోన్న వ్యూహాలేంటి..



తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ గుండెకాయలాంటింది. అలాంటి భాగ్యనగరంలో ఎన్నికలంటే.. అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. ఈ ఎన్నికలను పొలిటికల్‌ పార్టీలు సవాల్‌గా తీసుకుంటాయి. ఇక అధికార పార్టీకైతే ఈ ఎన్నికలు ఎంతో కీలకం. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో.. టీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. గ్రేటర్‌ జయకేతనం ఎగురవేసేందుకు అధికార టీఆర్‌ఎస్‌ వ్యూహాలు సిద్ధం చేస్తోంది.



తెలంగాణ సీఎం కేసీఆర్‌ గ్రేటర్‌ ఎన్నికలను ఓ సవాల్‌గా తీసుకుంటున్నారు. బల్దియాలో మరోసారి గులాబీ జెండా ఎగురవేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ కీలక నేతలు, మంత్రులు, హైదరాబాద్‌కు చెందిన నేతలతో సమీక్షలు నిర్వహించారు. కేటీఆర్‌, మహమూద్‌ అలీ, హరీశ్‌రావు, తలసాని, సబితా, శ్రీనివాస్‌గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి,మేయర్‌ బొంతు రామ్మోహన్‌తోపాటు ఇతర నేతలతో ఆయన గ్రేటర్‌ ఎన్నికలపై చర్చించారు. వీరందరితోపాటు ఎమ్మెల్యేలనూ ఎన్నికల ఇంచార్జీలుగా నియమించారు.



బల్దియా ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌ ఈసారి తనదైన రాజకీయ చతురతను కనబరుస్తున్నారు. దుబ్బాక ఎన్నికల ఫలితం తర్వాత సీఎం గతంలోకాకుండా.. సమిష్టి పనితో విజయం సాధించాలని స్కెచ్‌ వేశారు. ఒక కార్పొరేషన్‌ డివిజన్‌లో కూడా లేని టీఆర్‌ఎస్‌ పార్టీని.. గత ఎన్నికల్లో 99 డివిజన్లలో గెలిపించిన బాధ్యత కేటీఆర్‌కు దక్కింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అందుకే టీమ్‌ వర్క్‌ చేస్తూ విజయం సాధించాలని కేసీఆర్‌ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మంత్రులతోపాటు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు డివిజన్ల వారీగా గెలుపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఎవరి పనితనం ఏంటో తేల్చేలా ప్లాన్‌ రెడీ చేశారు.
https://10tv.in/ghmc-elections-high-court-cant-give-stay/
కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రులంతా గ్రేటర్‌ ఎన్నికల్లో మునిగిపోయారు. పటాన్‌చెరు నేతలతో మంత్రి హరీశ్‌రావు సమావేశం నిర్వహించి.. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయాత్తం చేశారు. ఇక మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముషీరాబాద్‌ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించగా.. మరోమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కుత్బుల్లాపూర్‌ నేతలతో భేటీ అయ్యారు. మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల హడావుడిలో మునిగిపోయారు.

మొత్తానికి పకడ్బంధీ ప్రణాళికలు, వ్యూహాలతో బల్దియా ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ అడుగులు వేస్తోంది. గతంలో కంటే ఎక్కువ డివిజన్లలో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోంది. మరి కేసీఆర్‌ వ్యూహం, రాజకీయ చతురతతో టీఆర్‌ఎస్‌ ఎన్ని డివిజన్లను తన ఖాతాలోవేసుకుంటుందో చూడాలి.