Ys Sharmila : వైఎస్ షర్మిల తొలి బహిరంగ సభపై నీలినీడలు

వైఎస్‌ షర్మిల ఖమ్మం సభపై కరోనా ఎఫెక్ట్ పడింది. సభకు అడ్డంకులు ఎదురవుతున్నాయి.

Ys Sharmila : వైఎస్ షర్మిల తొలి బహిరంగ సభపై నీలినీడలు

Ys Sharmila Khammam Meeting : వైఎస్‌ షర్మిల ఖమ్మం సభపై కరోనా ఎఫెక్ట్ పడింది. సభకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. జీవో నెంబర్‌ 68, 69 ప్రకారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఖమ్మం జిల్లా ఇన్‌ఛార్జ్‌ లక్కీనేని సుధీర్‌కు నోటీసులు అందజేశారు. కాగా, నిబంధనల ప్రకారం సభ నిర్వహిస్తామని షర్మిల టీమ్‌ పోలీసులకు చెప్పింది.

ఏప్రిల్ 9న ఖమ్మంలో వైఎస్‌ షర్మిల నిర్వహించబోతున్న బహిరంగ సభకు పోలీసుశాఖ మొదట అనుమతిచ్చింది. ఖమ్మం పెవిలియన్‌ గ్రౌండ్‌లో షర్మిల లక్షమందితో తొలి సభ నిర్వహించాలని షర్మిల భావించింది. రాష్ట్రంలో రాజన్న రాజ్యం సాధనే లక్ష్యంగా ఆమె పెట్టబోతున్న కొత్త పార్టీ పేరు, పార్టీ గుర్తు, జెండా, పార్టీ నియమావళి, సిద్ధాంతాలను ఈ సభలోనే ప్రకటిస్తారనే ప్రచారం కూడా జరిగింది.

తెలంగాణలో జరిగే తొలి సభకు ఖమ్మం వేదిక అవుతున్న నేపథ్యంలో ఖమ్మంలో సభ నిర్వహణకు గాను అనుమతి కోసం ఆ పార్టీ నేతలు ఖమ్మం నగర పోలీసు కమిషనర్‌ కు దరఖాస్తు చేసుకున్నారు. సభను జరుపుకునేందుకు అనుమతిని ఇచ్చినట్టే ఇచ్చి పోలీసులు ఆంక్షలు విధించారు.

‘ఖమ్మంలో బహిరంగ సభకు అనుమతి ఇస్తున్నాం. కాకపోతే ప్రస్తుం కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందిగా సూచిస్తున్నాం. ఆరు వేల మందికి మించి జనం ఈ సభకు రాకూడదు. సాయత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోపు మాత్రమే సభను నిర్వహించుకోవాలి. గడువు ముగిసేలోపే సభను ముగించేయాలి. సభలో అందరూ మాస్కులు విధిగా ధరించాలి. సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు ఉండాలి‘ అంటూ పోలీసులు కొన్ని నిబంధనలు విధించారు.

ఖమ్మంలో ఏప్రిల్ 9న భారీ బహిరంగ సభను నిర్వహించి, పార్టీ ప్రకటన చేయడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లోకి నేరుగా ఎంట్రీ ఇవ్వడానికి వైఎస్ షర్మిల అన్ని ఏర్పాట్లను చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మరి కేవలం ఆరు వేల మందితోనే సభను నిర్వహించడానికి షర్మిల సుముఖంగా ఉన్నారా? లేదా? అన్నది సందిగ్ధంగా మారింది. ఇదిలా ఉండగా, ఖమ్మంలో ప్రతీ రోజూ 20కి పైగా కేసులు వస్తున్నాయనీ, కొవిడ్ నిబంధనలు పాటించకపోతే ఈ కేసుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని పోలీసులు చెబుతున్నారు.