న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై కరోనా ఆంక్షలు…బహిరంగ ప్రదేశాల్లో వేడుకలకు అనుమతి నిరాకణ

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై కరోనా ఆంక్షలు…బహిరంగ ప్రదేశాల్లో వేడుకలకు అనుమతి నిరాకణ

Corona restrictions on New Year celebrations : 2021 కొత్త సంవత్సరం వేడుకలపై కరోనా ఆంక్షలు తెలుగు రాష్ట్రాల్లో కఠినంగా అమలుకానున్నాయి. గతంలోలా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు భారీ ఎత్తున గుమికూడడం, కేక్‌లు కట్ చేసి, డ్యాన్సులు చేయడం, సంబరాల్లో మునిగి తేలడం వంటివన్నీ ఈ న్యూ ఇయర్ సందర్భంగా కనపడవు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమై న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని, సురక్షితంగా ఉండాలని తెలుగు రాష్ట్రాల పోలీసులు సూచిస్తున్నారు. తాగి వాహనాలు నడపడం, కొత్త సంవత్సరం వేడుకల నిబంధనలు పాటించకపోవడం వంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై కరోనా ఆంక్షలు అమలు కానున్నాయి. ప్రజలు గుమికూడకుండా…బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు జరపుకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. సైబరాబాద్, హైదరాబాద్‌ కమిషనరేట్ల‌ పరిధిలో ఆంక్షలు అమలుకానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి.. రేపు ఉదయం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సైబర్‌ టవర్స్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, జేఎన్‌టీయూ, మైండ్‌ స్పేస్‌ ఫ్లై ఓవర్లు, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి మూసివేస్తున్నట్లు పోలీస్‌ శాఖ తెలిపింది. ఓఆర్‌ఆర్‌, పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై కార్లు, జీపులకు అనుమతి లేదని స్పష్టం చేసింది.

మరోవైపు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ట్యాంక్‌ బండ్‌, ఎన్టీఆర్ మార్గ్‌, నెక్టెస్‌ రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం వరకు వాహనాల రాకపోకలను నిషేధించారు అధికారులు. నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్క్‌, బీఆర్‌కే భవన్‌, తెలుగుతల్లి కూడలి, లిబర్టీ జంక్షన్‌, నల్లగుట్ట రైల్వే వద్ద వాహనాలను దారి మళ్లించనున్నారు.

తాజా ఆంక్షల నేపథ్యంలో బేగంపేట ఫ్లైఓవర్ మినహా నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ఫ్లైఓవర్లు ఇవాళ రాత్రి నుంచే మూతపడనున్నాయి. మరోవైపు మందుబాబులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది తెలంగాణ సర్కార్‌. ఇవాళ అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు తెరుచుకోవచ్చని అనుమతిచ్చింది.

న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించిన హైదరాబాద్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. అర్ధరాత్రి వేళ తాగి వాహనం నడిపితే కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. వాహనదారుల సురక్షిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో ట్రాఫిక్, లా అండ్‌ ఆర్డర్, ఏఆర్‌తో పాటు ఎస్‌వోటీ పోలీసులనూ భాగస్వామ్యం చేయనున్నారు పోలీసులు. తాగి వాహనం నడిపితే..నేరుగా జైలుకే వెళ్తారని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

పబ్బులు, బార్లు‌ ఎక్కువగా ఉండే సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఒక్క డిసెంబర్‌లోనే 2,351 కేసులు నమోదయ్యాయి. రాచకొండలో ఈ ఏడాదిలో 3,287 కేసులు నమోదయ్యాయి. దీంతో కఠిన చర్యలు అమలుచేస్తున్నారు సైబరాబాద్ కమిషనర్. మద్యం సేవించి వాహనం నడిపేవాళ్లు టెర్రరిస్టులతో సమానమని సజ్జనార్‌ అన్నారు.
మద్యం సేవించి వాహనం నడిపించేవారి సమాచారం నేరుగా వారు పనిచేసే ఆఫీసులకు చేరవేయనున్నారు.

అలాగే డ్రంకన్ డ్రైవ్ చేస్తూ మొదటిసారి పట్టుబడితే పదివేల రూపాయల ఫైన్ లేదా ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు. మూడు నెలల లైసెన్స్ రద్దు చేస్తారు పోలీసులు. రెండోసారి పట్టుబడితే 15వేల రూపాయల ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష, శాశ్వత లైసెన్స్ రద్దు చేసేందుకు పోలీసులు సమాయత్తం అయ్యారు.