హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య, కారులో వెళ్తుండగా కత్తులతో దాడి

హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య, కారులో వెళ్తుండగా కత్తులతో దాడి

highcourt lawyer couple murder: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల దగ్గర దారుణం జరిగింది. హైకోర్టు న్యాయవాది దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. న్యాయవాది వామన్ రావు, ఆయన భార్య నాగమణిపై దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. వామన్ రావు దంపతులు కారులో హైదరాబాద్ నుంచి స్వస్థలం మంథని వెళ్తుండగా ఈ హత్య జరిగింది.

కలవచర్ల పెట్రోల్‌ పంపు ఎదుట కారుని అడ్డుకున్న దుండగులు కారులో ఉండగానే కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఇరువురిని చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో దంపతులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చెక్‌పోస్టుల దగ్గర ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ నేత, మండల అధ్యక్షుడు కుంట శ్రీనివాస్ తమపై దాడి చేసినట్టు చనిపోయే ముందు వామన్ రావు చెప్పారు.

న్యాయవాదులుగా పని చేస్తున్న వామన్ రావు దంపతులు కొంతకాలంగా తమ స్వస్థలం గుంజపడుగు గ్రామంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, కబ్జాలు, వివాదాస్పద కేసులకు సంబంధించిన పిల్స్ హైకోర్టులో వేస్తున్నారు. బాధితుల పక్షాన వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కక్ష కట్టిన కొంతమంది కాపు కాసి మరీ న్యాయవాది దంపతులపై దాడి చేసినట్లుగా స్తానికులు చెబుతున్నారు. టీఆర్ఎస్ నేత కుంట శ్రీనివాస్ తనపై దాడి చేసినట్లుగా చివరిసారిగా వీడియోలో వామన్ రావు చెప్పారు. రక్తపు మడుగులో తీవ్ర గాయాలతో రోడ్డుపైనే న్యాయవాది వామన్ రావు చాలాసేపు కొట్టుమిట్టాడారు. తీవ్ర రక్తస్రావం కావడంతో వామన్ రావు, ఆయన భార్య నాగమణి మరణించారు.

హైకోర్టు న్యాయవాది దంపతులను నరికి చంపిన దుండగులు

కాగా, కుంట శ్రీనివాస్ టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్నాడు. టీఆర్ఎస్ కు చెందిన ఓ ప్రముఖ నాయకుడికి ఆయన అనుచరుడిగా ఉన్నాడు. మంథనికి చెందిన కీలక నేతకు సంబంధించిన ఆస్తుల వివాదానికి సంబంధించిన కేసులను కూడా న్యాయవాది వామన్ రావు వాదిస్తున్నారు. టీఆర్ఎస్ వ్యతిరేక కేసులన్నీ వామన్ రావు దంపతులు హైకోర్టులో వాదిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు చేస్తున్న అవినీతి, అక్రమాలను న్యాయవాది వామన్ రావు దంపతులు సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి తెస్తున్నారు.

కాగా, తనకు ప్రాణహాని ఉందని ఇటీవలే హైకోర్టు చీఫ్ జస్టిస్ కు న్యాయవాది వామన్ రావు దంపతులు తెలిపారు. శీలం రంగయ్య లాకప్ డెత్ కేసులో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ను కోర్టు విచారణ అధికారిగా నియమించింది. ఈ కేసు వాపస్ తీసుకోవాలని దుండగులు వామన్ రావుని బెదిరించారు. రామగుండం సీపీ సత్యనారాయణతో వామన్ రావు దంపతులు వాగ్వాదానికి దిగారు. గతంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుపై వీరు హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయవాదుల మరణంపై తెలంగాణ బార్ అసోసియేషన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.