ఉగ్రదాడి : నిజామాబాద్ జవాన్ వీర మరణం, ఏడాది క్రితమే ప్రేమ వివాహం

  • Published By: madhu ,Published On : November 9, 2020 / 06:18 AM IST
ఉగ్రదాడి : నిజామాబాద్ జవాన్ వీర మరణం, ఏడాది క్రితమే ప్రేమ వివాహం

Jawan from Nizamabad Dist among 4 killed near LoC : జమ్మూ-కశ్మీర్‌ మాచిల్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట జరిగిన ఎదురుకాల్పుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. వీరితో పాటు ఓ సైనికాధికారి, మరో బీఎస్‌ఎఫ్‌ జవాను సైతం ప్రాణాలు కోల్పోయారు. చొరబాటుకు యత్నించిన ముష్కరులను అడ్డుకునే క్రమంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.



అయితే ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ప్రాణాలు కోల్పోయిన సైనికుల్లో తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లి గ్రామానికి చెందిన జవాను ర్యాడా మహేష్‌, ఏపీలోని చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.



చొరబాటుదార్లకు, భద్రత బలగాలకు జరిగిన ఎదురుకాల్పుల్లో తెలంగాణ జవాన్‌ మహేష్‌ ప్రాణాలు విడిచాడు. తొలుత మహేష్‌కు తీవ్ర గాయాలు అయినట్టు ఆర్మీ అధికారులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత మహేష్‌ ఉగ్రదాడిలో వీరమణం పొందినట్టు తెలిపారు. దీంతో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.



వీర జవాన్‌ ర్యాడా మహేష్‌ నిజామాబాద్‌ జిల్లా వాసి. వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లి ఆయన స్వగ్రామం. గంగమల్లు, రాజు ఆయన తల్లిదండ్రులు. వీరిది వ్యవసాయ ఆధారిత కుటుంబం. మహేష్‌ అన్న ఉపాధి కోసం గల్ప్‌కు వెళ్లాడు. మహేష్‌ మాత్రం ఆర్మీలో చేరాలన్న లక్ష్యంతో చదివి ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఇంటర్‌ నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో చదివారు.



ఆ తర్వాత కరీంనగర్‌లోని ఓ పోటీ పరీక్షల కేంద్రంలో ట్రైనింగ్ తీసుకుని సైనిక ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 8 నెలల క్రితమే విధుల్లో చేరాడు. ట్రైనింగ్‌ ముగిశాక అసోంలో.. ఆతర్వాత డెహ్రడూన్‌లో బాధ్యతలు నిర్వర్తించాడు. మహేష్‌ ఏడాది క్రితమే హైదరాబాద్‌కు చెందిన ఆర్మీ కమాండర్‌ కూతురు సుహాసినిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. 8 నెలల క్రితం స్వగ్రామానికి వచ్చిన మహేష్‌ తిరిగి విధులకు బయలుదేరి వెళ్లారు.



జమ్ము కశ్మీర్‌లో విధులు నిర్వహించాల్సి రావడంతో.. మొదట అక్కడ పరిస్థితులు బాగా లేవని, జాగ్రత్తగా ఉంటున్నామని తమతో చెప్పేవాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈనెల 2వ తేదీన పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ నిర్వహించేందుకు తోటి జవాన్లతో కలిసి వెళ్తున్నానని, వచ్చాక ఫోన్‌ చేస్తానని తల్లిదండ్రులకు చెప్పాడు. అవే చివరి మాటలు అయ్యాయని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.