అవసరమైతే షర్మిల పార్టీ జగన్ ప్రభుత్వంతో కొట్లాడుతుంది, కొండా రాఘవరెడ్డి

అవసరమైతే షర్మిల పార్టీ జగన్ ప్రభుత్వంతో కొట్లాడుతుంది, కొండా రాఘవరెడ్డి

konda raghava reddy on sharmila party: హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిల కీలక సమావేశానికి తెలంగాణకు చెందిన సీనియర్ నేత కొండా రాఘవరెడ్డి హాజరయ్యారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో షర్మిల పార్టీ ఆవిర్భవిస్తుందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తోక పార్టీగా ఉండాలని షర్మిల అనుకోవడం లేదని, అందుకే తెలంగాణలో వైసీపీ శాఖను కొనసాగించకుండా షర్మిల కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని కొండా రాఘవరెడ్డి చెప్పారు. అన్ని అంశాల్లో తెలంగాణ ప్రయోజనాలకు కాపాడేందుకు షర్మిల పోరాటం చేస్తారని ఆయన తెలిపారు. అవసరమైతే ఏపీలోని జగన్ ప్రభుత్వంతో షర్మిల పార్టీ కొట్లాడుతుందని చెప్పారు.

”ఏపీలో జగన్ మంచి పాలన అందిస్తున్నారు. 18 నెలల పాలనలోనే 95శాతం వాగ్దానాలు పూర్తి చేశారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెడితే రాబోయే రోజుల్లో నీళ్లు, నిధులు, కొలువులు వంటి అనేక పంచాయతీలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో పూర్తి స్థాయిలో పార్టీ నడుపుతారు. భవిష్యత్తులో అవసరం అనుకుంటే జగన్ ప్రభుత్వంతో నీళ్లలో కావొచ్చు, నిధుల్లో కావొచ్చు ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండకుండా షర్మిల ముందుకెళ్లాలనే ఆలోచనతోనే నిర్ణయం తీసుకున్నారు. ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్లు పార్టీ పెట్టకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఒకే కుటుంబానికి చెందిన వారు నాలుగైదు పార్టీల్లో ఉన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాఖను తెలంగాణలో కొనసాగించకుండా ప్రత్యేకమైన పార్టీ పెట్టడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న ముఖ్యమంత్రికి తోక పార్టీగా ఉండటానికి సిద్ధంగా లేము. ఇక్కడ పార్టీ ఆవిర్భవిస్తుంది. తెలంగాణకు అవసరమైన అన్ని అంశాల్లో షర్మిల ముందుండి పోరాటం చేయడానికే ఈ పార్టీ పెట్టడం జరిగింది. పొత్తుల పంచాయతీ లేదు” అని కొండా రాఘవరెడ్డి అన్నారు.