Telangana Corona : మరోసారి లాక్ డౌన్ ? తట్టా..బుట్టా సర్దేసుకుంటున్నారు, సొంతూళ్లకు పయనం

తెలంగాణలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో... ఇక్కడ కూడా కఠినంగా ఆంక్షలు అమలు చేస్తారని... మళ్లీ లాక్‌డౌన్ పెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

Telangana Corona : మరోసారి లాక్ డౌన్ ? తట్టా..బుట్టా సర్దేసుకుంటున్నారు, సొంతూళ్లకు పయనం

Telangana Lockdown

Lockdown : తెలంగాణలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో… ఇక్కడ కూడా కఠినంగా ఆంక్షలు అమలు చేస్తారని… మళ్లీ లాక్‌డౌన్ పెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కరోనా ప్రభావంతో దేశంలో లాక్‌డౌన్‌ విధించి ఏడాది గడుస్తోంది. అప్పుడు పడ్డ ఇబ్బందులు, అనుభవించిన బాధలు.. వలస కార్మికుల కళ్లలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. తాజాగా.. కొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ అమల్లో ఉండడం, తెలంగాణలోనూ క్రమంగా కేసులు పెరుగుతుండడంతో.. మళ్లీ లాక్‌డౌన్‌ పిడుగు పడుతుందేమోనని భయపడిపోతున్నారు. ఈ క్రమంలో.. ముందుగానే తట్టాబుట్టా సర్దేసుకుంటున్నారు. సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. వివిధ ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే వలస కార్మికులతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.

గతేడాది జూన్‌ 1 నుంచి అన్‌లాక్‌ ప్రక్రియను ప్రారంభించిన కేంద్రప్రభుత్వం… దశలవారీగా దాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఆ తర్వాత వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో… కరోనా కేసులు పెరుగుతున్నా క్రమంగా జనజీవనం సాధారణ స్థితికి చేరింది. అయితే, కొద్దిరోజులుగా మళ్లీ దేశంలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆయా రాష్ట్రాలు కట్టడి చర్యలు ప్రారంభించాయి. కొన్ని నగరాల్లో నిబంధనలు కట్టుదిట్టం చేయడంతో పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు కేంద్రం సుముఖంగా లేకపోయినా.. నగరాలు, పట్టణాల్లో పరిస్థితులను బట్టి.. మళ్లీ ఆంక్షలు మొదలవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా తెలంగాణలోని విద్యాసంస్థలు, హాస్టల్స్‌, గురుకులాల్లో వైరస్‌ వ్యాప్తి బాగా పెరిగింది. వందలమంది విద్యార్థులు వైరస్‌ బారినపడ్డారు. ప్రజలు మాస్కులు ధరించకపోవడం, సమూహాలుగా ఉండటం, టీకా తీసుకునేందుకు సంకోచించడంతో వైరస్‌ మళ్లీ విజృంభిస్తోందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కరోనా వ్యాక్సిన్‌పై అపోహలే దీనికి కారణమంటున్నారు.