ఉద్యోగం చేయాలంటే..హైదరాబాద్ లోనే

ఉద్యోగం చేయాలంటే..హైదరాబాద్ లోనే

Hyderabad

Hyderabad : భాగ్యనగరానికి మరొక గుర్తింపు లభించింది. దేశంలో ఉద్యోగార్థులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే నగరాల జాబితాలో హైదరాబాద్‌ టాప్‌లో నిలిచింది. వీబాక్స్, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ, టాగ్డ్‌ అనే సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌-2021లో ఎక్కువ మంది హైదరాబాద్‌ మహానగరానికే ఓటు వేశారు. ఉద్యోగం చేయడానికి ఎక్కువగా ఇష్టపడే నగరంగానే కాకుండా.. ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్న నగరాల్లోనూ భాగ్యనగరమే ముందు ఉంటోందని ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌ స్పష్టం చేసింది. హైదరాబాద్‌ తర్వాత బెంగళూరు, పుణె, ఢిల్లీ నగరాలు ఉన్నాయి.

కొవిడ్‌ వ్యాప్తి తర్వాత దేశవ్యాప్తంగా పారిశ్రామిక అవసరాలు, ఉద్యోగావకాశాలు, విద్యార్థుల సామర్థ్యాలు, కరోనా ప్రభావం వంటి అంశాలపై వీబాక్స్‌ అనే సంస్థ నేషనల్‌ ఎంప్లాయిబిలిటీ టెస్ట్‌ నిర్వహించింది. దేశవ్యాప్తంగా 65 వేల మంది విద్యార్థులతో పాటు 15 పరిశ్రమలు, 150కిపైగా కార్పొరేట్‌ సంస్థలను సంప్రదించి, వివిధ అంశాలపై అధ్యయనం చేసి ఈ నివేదిక రూపొందించింది. ఇందులో క్రిటికల్‌ థింకింగ్‌లో టాప్‌ టెన్‌లో నాలుగో స్థానంలో నిలిచారు తెలంగాణ విద్యార్థులు. ఇంగ్లీష్‌ నైపుణ్యంలో ఐదో స్థానంలో ఉన్నారు.

న్యూమరికల్‌ స్కిల్స్‌లో ఏపీ స్టూడెంట్స్‌ 5వ ప్లేస్‌లో ఉంటే తెలంగాణ విద్యార్థులు 8వ స్థానంలో ఉన్నారు. కంప్యూటర్‌ స్కిల్స్‌లో తెలంగాణ విద్యార్థులు 9వ స్థానంలో ఉన్నారు. మాతృభాష కాకుండా సెకండ్‌ లాంగ్వేజ్‌గా ఇంగ్లీష్, స్కిల్స్‌ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్థాన్‌ ఫస్ట్‌ ప్లేస్‌ సాధించింది. కంప్యూటర్‌ స్కిల్స్‌లో పశ్చిమ బెంగాల్‌ రెండోస్థానంలో నిలిచింది.