నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, ఓటర్ ఎటువైపో

  • Published By: madhu ,Published On : October 9, 2020 / 05:54 AM IST
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, ఓటర్ ఎటువైపో

nizamabad local body mlc bypoll : నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 2020, అక్టోబర్ 09వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఓటర్ ఎటువైపు ఉన్నాడనే ఉత్కంఠ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో నెలకొంది. కానీ..ఏకపక్షంగా ఉంటుందని పలువురు వెల్లడిస్తున్నారు.



ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకే విజయావకాశాలు ఉన్నాయంటున్నారు. ఎందుకంటే..మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ ఓటర్లున్నారు. అంతేగాకుండా..కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కనీసం డిపాజిట్లు దక్కించుకోవంటున్నారు.



బలబలాలు : –
మొత్తం 824 మంది ఓటర్లున్నారు. ఇందులో టీఆర్ఎస్ కు చెందిన ప్రజాప్రతినిధులు 504 మంది ఉన్నారు. ఇది..మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువే. మిత్రపక్షమైన ఎంఐఎం ప్రజాప్రతినిధులు 28 మంది టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు ఓటేసే ఛాన్స్ ఉంది. స్వతంత్రులు 60 మంది ఉన్నారు.వీరిలో దాదాపు అందరూ టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్న వారే.



కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు 142 మంది ఉన్నారు. ఇందులో 75 మంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పార్టీ బలం 67కు తగ్గింది.



బీజేపేకి 85 మంది ప్రజాప్రతినిధులున్నారు. వీరిలో 35 మంది టీఆర్ఎస్ లో చేరిపోయారు.



మొత్తంగా టీఆర్ఎస్ కు 700కంటే పైగానే ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.



824 మంది ఓటర్లున్నారు. వీరిలో 24 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారిన పడడం కలకలం రేపింది.



బరిలో నిలిచిన అభ్యర్థులు : మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (టీఆర్‌ఎస్‌), వి.సుభాష్‌రెడ్డి (కాంగ్రెస్‌), పి.లక్ష్మినారాయణ (బీజేపీ) పోటీలో ఉన్నారు.