ఎడారి దేశంలో.. తడారిపోతున్న తెలంగాణ బతుకులు

ఎడారి దేశంలో.. తడారిపోతున్న తెలంగాణ బతుకులు

people Difficulties of Telangana in the Gulf : ఎడారి దేశంలో.. తెలంగాణ వాసుల బతుకులు తడారిపోతున్నాయి. తెలిసి.. తెలిసి కొందరు.. అసలేం తెలియక ఇంకొందరు.. అర్థమయ్యేలోపే అంతా మోసపోతున్నారు. ఇక్కడి నుంచి ఎన్నో ఆశలతో అక్కడికి వెళ్తున్నారు. తీరా అక్కడికెళ్లాక.. పరిస్థితులన్నీ తలకిందులైపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గల్ఫ్ మోసాలపై టెన్ టీవీ స్పెషల్ రిపోర్ట్..

కష్టాలను అధిగమించేందుకు ఉపాధి వేటలో పడి.. అరబ్ దేశాల ఉద్యోగాలపై ఆశపడుతున్నారు. ఎడారి దేశాల్లో.. ఎన్నో కష్టాలుంటాయని తెలిసినా.. ఎంతో కొంత సంపాదించుకొని.. ఆర్థిక కష్టాల నుంచి బయటపడొచ్చనే ఆశే.. వాళ్లను సముద్రాలు దాటిస్తోంది. అందుకే.. అప్పులు చేసి మరీ అక్కడి దాకా వెళ్తున్నారు. తర్వాత.. నకిలీ వీసాల పేరుతో అరెస్టై.. జైలు పాలవుతున్నారు. ఇంకొందరు.. అక్కడ చేసేందుకు పనిలేక పస్తులుంటున్నారు. మరికొందరు.. ఏజెంట్ల చేతిలో మోసపోయి.. తిరిగి రాలేక.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ.. జనం మనసును కలచివేస్తాయేమో గానీ.. గల్ఫ్‌కు వలస వెళ్లే వారికి మాత్రం చాలా సాధారణం.

నకిలీ వీసాలు, విజిటింగ్ వీసాలనే.. కంపెనీ వీసాలుగా నమ్మిస్తున్నారు బోగస్ ఏజెంట్లు. వాళ్లను నమ్మి.. గంపెడాశతో గల్ఫ్ వెళ్లిన అనేక మంది.. ఆ దేశాల్లో నరకయాతన అనుభవిస్తున్నారు. సౌదీ అరేబియా, దుబాయ్, షార్జా, మస్కట్, ఒమన్, కువైట్, ఖతర్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లి.. ఎంతోమంది తెలంగాణవాసులు గోస పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాలన్నీ.. గల్ఫ్ బాధిత జిల్లాలే. ఇప్పటి వరకు రెండున్నర లక్షల మందికి పైగా వలస బాట పట్టగా.. ఇందులో సగానికి పైగా ఏజెంట్ల మోసాలకు గురైన వారే అధికంగా ఉన్నారు. వలస వెళ్లిన వారిలో.. మరో 10 శాతం మంది అక్కడే ఆత్మహత్యలు చేసుకొని.. వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు.

కష్టపడి పనిచేయడం తప్ప.. వీసా వ్యవహారాలు, గల్ఫ్ దేశాల్లో చట్టాలు తెలియని చాలా మంది అమాయకులు, నిరక్షరాస్యులంతా.. ఏజెంట్ల మోసాలకు గురవుతున్నారు. డబ్బులు పోగేసి.. అప్పులు చేసి.. గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. కుటుంబం కోసం.. ఎంతటి నరకాన్ని అయినా అనుభవిస్తున్నారు. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని.. ఏజెంట్లు బాగానే సంపాదించుకుంటున్నారు. కేవలం విజిట్ వీసాల మీద గల్ఫ్ దేశాలకు పంపిస్తున్నారు. అలా.. గడువు తీరిన తర్వాత అక్కడి పోలీసుల తనిఖీల్లో పట్టుబడి అరెస్టవుతున్నారు. ఇలా.. గల్ఫ్ దేశాల్లోని ప్రతి జైల్లో తెలంగాణ వాసులుంటున్నారు.

ఇదిలా ఉంటే.. అధికారులతో కుమ్మక్కై నకిలీ వీసాలతో కొన్ని ఏజెన్సీలు గల్ఫ్ దేశాలకు పంపుతున్నాయి. ఇక్కడ పని ఒప్పందం కుదుర్చుకోవడం.. అక్కడికి వెళ్లాక పనిలేదని చెప్పడం సాధారణమైపోయింది. దీంతో.. అక్కడ ఉండలేక.. చేసిన అప్పులు ఎలా కడతామనే బాధతో తిరిగి రాలేక.. చాలామంది గల్ఫ్ దేశాల్లోనే ఆత్మహత్యలు చేసుకున్న విషాద ఘటనలూ ఉన్నాయి.

గల్ఫ్‌కు ఉపాధి కోసం వెళ్లి అనారోగ్యం పాలై చనిపోయిన వాళ్లూ.. చాలా మందే ఉన్నారు. గుండె బరువై.. తనువు చాలించుకున్న ఘటనలూ ఉన్నాయి. గల్ఫ్‌కు వెళ్లాక.. వాళ్లు అక్కడ ఎలా ఉన్నారో.. ఏం చేస్తున్నారో.. కనీస సమాచారం రాక ఎదురుచూస్తున్న కుటుంబాలు ఇంకా ఉన్నాయి. గల్ఫ్‌లో చనిపోయిన ఇక్కడి వారి శవాలు కూడా.. స్వదేశం చేరని దుస్థితి నెలకొంది.

ఎన్నో ఏళ్లుగా.. వీసాల మోసాల పరంపర సాగుతున్నా.. బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా.. గల్ఫ్‌కు వలస వెళ్లే వాళ్ల సంఖ్యలో మాత్రం మార్పులేదు. కష్టాల నుంచి గట్టెక్కేందుకు.. ఉపాధి వేటలో పడి.. ఆత్మీయులను, పుట్టిన గడ్డను వదిలి.. బతుకుదెరువు కోసం బరువెక్కిన హృదయాలతో.. దేశం దాటి పోతున్నారు. ఈ వలస బతుకుల గుండెల్లో.. అంతులేని ఆవేదన ఉంటుంది. వారి నిత్యజీవితం నరకప్రాయమై.. శోకసంద్రంగానే కనిపిస్తుంది.