ఎన్టీఆర్ తర్వాత కేసీఆరే, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపిస్తే హైదరాబాద్ క్షేమం

  • Published By: naveen ,Published On : November 21, 2020 / 12:46 PM IST
ఎన్టీఆర్ తర్వాత కేసీఆరే, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపిస్తే హైదరాబాద్ క్షేమం

posani krishna murali ghmc elections: జీహెచ్ఎంసీ ఎన్నికలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తే అభివృద్ది కొనసాగుతుందని పోసాని అన్నారు. ఎన్టీఆర్ తర్వాత హైదరాబాద్ లో శాంతిభద్రతలను కాపాడింది కేసీఆరే అని పోసాని అన్నారు. తాను 35ఏళ్లుగా హైదరాబాద్ ను చూస్తున్నట్టు చెప్పారు.

ఒకప్పుడు తెలంగాణలో నీళ్లు లేవు, రైతులు ఇబ్బంది పడేవారని పోసాని వాపోయారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఆకుపచ్చగా మారిందన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ దేశంలోనే లేదన్నారు. గతంలో కరెంటు ఎప్పుడు వచ్చేదో, ఎప్పుడు పోయేదో తెలియదన్న పోసాని.. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణలో పవర్ కట్ లేదని చెప్పారు.

టీఆర్ఎస్ ని గెలిపిస్తే హైదరాబాద్ నగరం క్షేమం:
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే హైదరాబాద్ నగరం క్షేమంగా ఉంటుందని పోసాని కృష్ణమురళి అన్నారు. ఈ ఆరున్నరేళ్ల పాలనలో కేసీఆర్ సమర్థత, నిబద్దత వల్లే రాష్ట్రంలో తక్కువ సమయంలోనే ఎక్కువ అభివృద్ది జరిగిందన్నారు. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, శాంతిభద్రతలు.. ఇలా చాలా విషయాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథంలో ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణ, ఆంధ్రా అన్న బేధం లేకుండా ప్రతి ఒక్కరి పట్ల సోదర భావంతో కేసీఆర్ పాలన సాగుతోందన్నారు. అందుకే ఈ ఆరున్నరేళ్లలో ఎక్కడా ఎవరిపై దాడులు జరగలేదన్నారు. కాబట్టి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపిస్తే హైదరాబాద్ క్షేమంగా ఉంటుందన్నారు.

ఆంధ్రా వాళ్లు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు:
కేసీఆర్ సీఎం అయ్యాకే రాష్ట్రంలో 24గంటలు విద్యుత్ అందుబాటులోకి వచ్చిందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని రీతిలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం నిర్మించి రాష్టాన్ని సస్యశ్యామలం చేశారని చెప్పారు. అలాగే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు చేపట్టారన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా వాళ్లు.. ఈ ఆరున్నరేళ్లలో ఏదైనా ఇబ్బంది కలిగిందా అని తమను తాము ప్రశ్నించుకోవాలన్నారు. ఆంధ్రా వాళ్లు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారని గుర్తుచేశారు.

వరదలు ఎవరూ ఊహించలేరు:
హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసిన వరదల గురించి ప్రస్తావించిన పోసాని… హైదరాబాద్‌కు వరదలు వస్తాయని ఎవరూ ఊహించలేరన్నారు. ఎప్పుడో వందేళ్ల క్రితం నిజాం పాలనలో వరదలు వచ్చి వందలాది మంది చనిపోయారని గుర్తుచేశారు. వరదల ప్రభావంతో అప్పటి నిజాం.. ఆనాటి 15లక్షల హైదరాబాద్ జనాభాను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ వ్యవస్థ నిర్మించారన్నారు. ఇప్పటికీ అదే డ్రైనేజీ వ్యవస్థ ఉందన్నారు. అయితే ప్రజలు, చోటా మోటా నేతలు చెరువులు, నాలాలను ఆక్రమించడం, ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో నష్టం జరిగిందన్నారు. కేసీఆర్ లాంటి వారు లక్ష మంది ఉన్నా.. కేంద్రమే జోక్యం చేసుకున్నా వరదలను ఎవరూ ఆపలేరని అన్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వ అలసత్వంగా భావించకూడదన్నారు.

శాంతిభద్రతల విషయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం:
టీఆర్ఎస్‌ను గెలిపించాలన్న పోసాని టీఆర్ఎస్ పాలనలో శాంతిభద్రతల విషయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి, కమిషనర్ అంజనీ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. దిశ ఎన్‌కౌంటర్ పట్ల ప్రభుత్వం ఎలా స్పందించిందో ప్రతీ ఒక్కరూ చూశారని గుర్తుచేశారు. ఒకప్పుడు నగరంలో పెద్ద సంఖ్యలో చైన్ స్నాచింగ్‌లు జరిగేవని… ఇప్పుడవి 90శాతం తగ్గిపోయాయని అన్నారు. ఇటీవలే గచ్చిబౌలిలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. కాబట్టి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు పోసాని. శనివారం(నవంబర్ 21,2020) హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో దర్శకుడు ఎన్‌.శంకర్‌తో కలిసి పోసాని మీడియాతో మాట్లాడారు.