Rs 2000 Scheme : ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.32 కోట్లు విడుదల

గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీచర్లు, సిబ్బందికి ప్రకటించిన ఆర్థిక సాయానికి

Rs 2000 Scheme : ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.32 కోట్లు విడుదల

Rs 2000 Scheme

Rs 2000 Scheme : గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీచర్లు, సిబ్బందికి ప్రకటించిన ఆర్థిక సాయానికి నిధులు విడుదల చేసింది. ఏప్రిల్‌ నెలలో అందించేందుకు ప్రభుత్వం రూ.32కోట్లు రిలీజ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్కూళ్లు తిరిగి తెరిచేవరకు ప్రతినెల ఒక్కొక్కరికి రూ.2వేల ఆర్థిక సాయం, 25 కిలోల బియ్యం అందివ్వాలని ఇటీవలే సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

సీఎం నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీని ద్వారా దాదాపు లక్షన్నరమంది ప్రైవేట్‌ టీచర్లు, ఇతర సిబ్బందికి లబ్ధి చేకూరనుంది. ప్రైవేట్‌ టీచర్లు, సిబ్బంది.. తమ ధ్రువీకరణ, బ్యాంకు ఖాతా, ఆధార్ తదితర వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే అధికారులు సూచించిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు మూతపడటంతో ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బంది ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జీతాలు లేక పూట గడవటం కూడా కష్టంగా మారింది. కొన్ని రోజుల క్రితం ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేట్ స్కూల్ టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత అతడి భార్య సూసైడ్ చేసుకుంది. ఉపాధి లేక చాలా కుటుంబాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలో మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ స్పందించారు. వారిని ఆదుకోవాలని నిర్ణయించారు. నెలకు రూ.2వేల సాయం ప్రకటించారు.

వారికి కూడా సాయం:
కరోనా విపత్కర పరిస్థితుల్లో స్కూళ్లు లేక, వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ప్రైవేటు స్కూల్‌ టీచర్లు, సిబ్బందికి ఆర్థిక సాయంగా నెలకు రూ.2వేల నగదు ఇవ్వనుంది ప్రభుత్వం. అలాగే ప్రతి నెల 25కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వనుంది. కరోనా సాయాన్ని ప్రభుత్వం మరికొంత మందికీ విస్తరించింది. బోధనేతర సిబ్బంది క్యాటగిరీలో ఆయాలు, డ్రైవర్లకు కూడా రూ.2 వేల నగదు, 25 కిలోల సన్నబియ్యం అందించనుంది. ఇదివరకు టీచర్లు, క్లర్కులు, అకౌంటెంట్లు, లైబ్రరీ, ల్యాబ్‌ అసిస్టెంట్లు, అటెండర్లు, స్వీపర్లు మాత్రమే ఈ పథకానికి అర్హులని చెప్పారు. తాజాగా ఆయాలు, డ్రైవర్లను కూడా ఆ జాబితాలో చేర్చారు.

1.45లక్షల మంది.. నెలకు రూ.42కోట్లు:
స్కూల్స్ తిరిగి తెరిచే వరకు రూ.2వేలు ఆపత్కాల ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యాన్ని రేషన్‌ షాపుల ద్వారా ఉచితంగా సరఫరా చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రైవేటు టీచర్లు, సిబ్బందిని మానవీయ దృక్పథంతో ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని సీఎం తెలిపారు.

ఈ నెల(ఏప్రిల్) 20 నుంచే ఆర్థిక సాయం అందజేయనుంది ప్రభుత్వం. 20వ తేదీ నుంచి 24వ తేదీ లోపు.. ప్రైవేట్ టీచర్లు, సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు డిపాజిట్ చేస్తారు. 10 నుంచి 15వ తేదీ వరకు విద్యాశాఖ… అర్హులైన వారి వివరాలను జిల్లాలకు పంపిస్తుంది. 16 నుంచి 19వ తేదీ వరకు పరిశీలన, లబ్దిదారుల గుర్తింపు ఉంటుంది. అలాగే రేషన్ షాపుల ద్వారా 25కిలోల బియ్యం ఇస్తారు. దాదాపు 1.45లక్షల మంది టీచర్లు, సిబ్బంది ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారని.. వారికి సాయం కోసం నెలకు రూ.42కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.

కార్డు లేకున్నా రేషన్:
కరోనా కష్టకాలంలో ఆహార భద్రత (రేషన్‌) కార్డు లేకున్నా.. రూ.2 వేల ఆర్థిక సాయం, 25 కిలోల రేషన్‌ బియ్యానికి ప్రైవేట్‌ టీచర్లు అర్హులే అని ప్రభుత్వం చెప్పింది. నగరంలో సగం మందికిపైగా ప్రైవేట్‌ టీచర్లకు రేషన్‌ కార్డు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో సంబంధం లేకుండా విద్యాసంస్ధల్లో మార్చి 2020 నాటికి జీతాలు చెల్లించిన రికార్డుల ఆధారంగా ప్రధానోపాధ్యాయుడు సమర్పించే ధ్రువీకరణ ప్రామాణికంగా ఆర్థిక సాయం అందజేసేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది.

రేషన్‌ కార్డు లేనివారికి వారి ప్రస్తుత చిరునామాతో రేషన్‌ పంపిణీ చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. శనివారం(ఏప్రిల్ 10,2021) నుంచే ప్రైవేట్‌ పాఠశాలల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.

సగం టీచర్లు ఇక్కడే..
రాష్ట్రం మొత్తంలో సగానికి పైగా ప్రైవేట్‌ విద్యా సంస్ధలు నగర పరిధిలోనే ఉన్నాయి. దీంతో ప్రైవేట్‌ టీచర్ల సంఖ్య కూడా ఇక్కడే ఎక్కువ. కరోనా నేపథ్యంలో విధుల నుంచి తొలగించిన వారి శాతం కూడా అధికమే. ఏడాది కాలంగా ఉపాధి లేక ప్రైవేట్‌ టీచర్ల కుటుంబాలు అలమటిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం ప్రైవేట్‌ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది సంఖ్య లక్షన్నర పైగా ఉన్నట్టు తెలుస్తోంది. అత్యధికంగా లబ్ధిదారులు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని మూడు జిల్లాల్లో సుమారు 66 వేలకుపైగా ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.