తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల భేటీ, తేలుస్తారా..బస్సులు తిరుగుతాయా ?

  • Published By: madhu ,Published On : September 15, 2020 / 06:31 AM IST
తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల భేటీ, తేలుస్తారా..బస్సులు తిరుగుతాయా ?

TSRTC, APSRTC : అన్‌లాక్‌ -4లో రాష్ట్రాల మధ్య రవాణాపై ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎత్తివేసింది. అయితే ఏపీ, తెలంగాణ మధ్య పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు మాత్రం ఇంకా పునరుద్ధరణ కాలేదు. బస్సులు పునరుద్ధరించాలంటే తెలంగాణ ఆర్టీసీ, ఏపీఎస్‌ ఆర్టీసీకి కొన్ని ప్రతిపాదనలు పెట్టింది. ఈ ప్రతిపాదనలపై పలుమార్లు సమావేశాలు జరిగినప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు.




దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ప్రైవేట్‌ బస్సులు తిరుగుతుండడంతో…. ప్రయాణికులంతా వాటిని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆర్టీసీకి మరింత నష్టం జరుగుతోంది.

ఏపీ నుంచి కర్నాటక, ఒడిశాకు ఇప్పటికే ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. తమిళనాడులో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో.. అక్కడి ప్రభుత్వం ఇంకా అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి ఇవ్వలేదు. ఇటు తెలంగాణ మాత్రం స్టేట్‌ అగ్రిమెంట్‌ అయిన తర్వాతే బస్సులకు అనుమతి ఇస్తామని చెబుతోంది.




ఏపీ బస్సులు తెలంగాణ భూభాగంలో రెండు లక్షల 60 వేల కిలోమీటర్లు తిరుగుతుండగా…. తెలంగాణ బస్సులు ఏపీలో లక్షా 50వేల కిలోమీటర్లు మాత్రమే తిరుగుతున్నాయి.ఇంటర్‌ స్టేట్‌ అగ్రిమెంట్ ప్రకారం ఇరు రాష్ట్రాలు సమాన కిలోమీటర్లు బస్సులు నడుపుకోవాలి. రాష్ట్ర విభజనతో పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని ఉన్న నేపథ్యంలో… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎలా అయితే బస్సులు నడిచాయో… అలానే ఇప్పటి వరకు నడిచాయి.

అయితే టీఎస్‌ ఆర్టీసీ మాత్రం ఇప్పుడు ఇంటర్‌ స్టేట్‌ అగ్రిమెంట్‌ చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే… తెలంగాణలో ఏపీ బస్సులు అదనంగా తిరుగుతున్న లక్షా 10వేల కిలోమీటర్లను తగ్గించుకోవాలనే ప్రతిపాదన పెట్టింది. ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు మాత్రం తాము 50వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని.. తెలంగాణ అదనంగా 50వేల కిలోమీటర్లు పెంచుకుంటే సమానంగా ఉంటుందనే ప్రతిపాదన పెట్టారు.




ఏపీఎస్‌ ఆర్టీసీ పెట్టిన ప్రతిపాదనను టీఎస్‌ ఆర్టీసీ అధికారులు అంగీకరించడం లేదు. 50వేల కిలోమీటర్లు పెంచుకుంటే.. ఇప్పటికిప్పుడు కొత్త బస్సులను టీఎస్‌ ఆర్టీసీ కొనుగోలు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏపీ బస్సులు తిరిగే అదనపు కిలోమీటర్లు తగ్గించుకోవాలనే ప్రధాన డిమాండ్‌ పెడుతోంది. అదనపు కిలోమీటర్లు తగ్గించుకుంటే ప్రైవేట్‌ బస్సు ఆపరేటర్లు లాభపడతారు తప్ప… ఇరు రాష్ట్రాల ఆర్టీసీ నష్టపోతుందని ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

ఇంటర్‌ స్టేట్‌ అగ్రిమెంట్‌పై చర్చించేందుకు సమయం పడుతుండడంతో.. తెలంగాణకు ఫస్ట్‌ ఫేజ్‌లో 72వేల కిలోమీటర్లు తిప్పేందుకు అనుమతించాలని టీఎస్‌ ఆర్టీసీని…ఏపీఎస్‌ ఆర్టీసీ కోరింది. కానీ టీఎస్‌ ఆర్టీసీ దీనిపై సానుకూలంగా స్పందించలేదు. ఇంటర్‌ స్టేట్‌ అగ్రిమెంట్‌ అయిన తర్వాతే బస్సులు కదలాలనే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.




2020, సెప్టెంబర్ 15వ తేదీ మంగళవారం మరోసారి ఇరు రాష్ట్రాల ఆర్టీసీలకు చెందిన అధికారుల సమావేశం జరుగనుంది. హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశానికి ఇరు ఆర్టీసీల ఎండీలు పాల్గొంటున్నారు. ఈ సమావేశంలోనైనా అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసులపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందని అధికారులు బావిస్తున్నారు.

టీఎస్‌ ఆర్టీసీ పెట్టిన డిమాండ్‌కు.. ఏపీఎస్‌ ఆర్టీసీ మొగ్గుచూపే అవకాశమూ లేకపోలేదు. లేదంటే తొలి దశగా 72వేల కిలోమీటర్లు బస్సు సర్వీసులు నడిపేలా ఈ సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చే చాన్స్‌ ఉంది. ఇరు రాష్ట్రాలు అంతరాష్ట్ర బస్సు సర్వీసులపై త్వరగా పరిష్కరించుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.