YS Sharmila: కలిసి పోరాడదాం.. బండి సంజయ్, రేవంత్ రెడ్డికి షర్మిల ఫోన్..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay), టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) లకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల (Y.S. Sharmila) ఫోన్ చేశారు. నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని కోరారు. ప్రగతి భవన్ మార్చ్‌కు పిలుపునిద్దామని అన్నారు.

YS Sharmila
YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల (Y.S. Sharmila) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) , టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) లకు ఫోన్ చేశారు. నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఉమ్మడి కార్యాచరణ (joint activity) సిద్ధం చేద్దామని, తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చూద్దామని కోరారు. ప్రభుత్వం తీరును ఎండగడుతూ ప్రగతి భవన్ (Pragati Bhavan) మార్క్ పిలుపునిద్దామని షర్మిల సంజయ్, రేవంత్ రెడ్డిలను కోరారు. కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని, కలిసి పోరాటంచేయకపోతే ప్రతిపక్షాలను తెలంగాణలో కేసీఆర్ బతకనివ్వడని షర్మిల వారితో పేర్కొన్నారు.
షర్మిల సూచించిన విధంగా ఉమ్మడి పోరాటం చేసేందుకు బండి సంజయ్ మద్దతు తెలిపారు. త్వరలో సమావేశం అవుదామని చెప్పిన ఆయన, నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి సైతం షర్మిల ప్రతిపాదనకు ఓకే చెప్పినట్లు తెలిసింది. ప్రతిపక్షాలు కలిసి పోరాటంచేయాల్సిన సమయం ఏర్పడిందని , అయితే, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ షర్మిలతో చెప్పినట్లు తెలిసింది.
Bandi Sanjay : పక్కా.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం-బండి సంజయ్
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజీ అంశం, నిరుద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై షర్మిల తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ప్రశ్నాపత్రం లీకేజీని బాధ్యతలుపై చర్యలు తీసుకోవాలని, కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి ఆమె శుక్రవారం పిలుపునిచ్చిన విషయం విధితమే. అయితే, పోలీసులు షర్మిలను అడ్డుకున్నారు. గతంలోనూ పలుసార్లు ఆందోళనకు దిగిన షర్మిలను పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్టు చేసిన విషయం విధితమే.
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఒక్కోపార్టీ ఒక్కో రీతిలో నిరసన తెలుపుతోంది. అయితే, ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ప్రభుత్వంపై పోరాడదామని తాజాగా షర్మిల సంజయ్, రేవంత్ రెడ్డిను ఫోన్ ద్వారా కోరడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.