CM KCR కీలక నిర్ణయం : ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

  • Published By: nagamani ,Published On : July 17, 2020 / 03:31 PM IST
CM KCR కీలక నిర్ణయం : ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

ఇంటర్, డిగ్రీ విద్యార్ధుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థుల్లో చాలామంది లంచ్ బాక్సులు తెచ్చుకోవటంలేదు. దీంతో మధ్యాహ్నాం భోజనానికి ఇంటికి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపవుట్స్‌ పెరిగిపోతున్నాయని గుర్తించిన ప్రభుత్వం ఇంటర్, డిగ్రీ విద్యార్ధులకు కాలేజీల్లోనే మధ్యాహ్నా భోజనం పెట్టాలని సీఎం కేసీఆర్‌ భావించటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపవుట్స్‌ తగ్గించటానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.అంతేకాదు ఇటువంటి పరిస్థితిని నివారించడంతో పాటు విద్యార్థులకు పౌష్ఠికాహారం ఇవ్వాలనే మంచి ఉద్ధేశ్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు.

కాగా..జడ్చర్ల డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ రఘురామ్‌ తన సొంత ఖర్చులతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారని సీఎం కేసీఆర్‌ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లెక్చరర్‌ రఘురామ్‌ను సీఎం అభినందించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కేసీఆర్ ప్రభుత్వ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాల్సిన అవసరాన్ని సీఎం గుర్తించారు. రఘురామ్‌ విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్‌ కాలేజీకి నూతన భవనాన్ని సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.