ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులపై టి.సర్కార్ గుస్సా

  • Published By: madhu ,Published On : August 2, 2020 / 08:42 AM IST
ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులపై టి.సర్కార్ గుస్సా

కరోనా రోగుల పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సిన ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు చేస్తున్న దోపిడిపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. లక్షల రూపాయలు వసూలు చేస్తున్న వాటిపై కొరఢా ఝులిపించనుంది. ఆయా ఆసుపత్రులకు ఇచ్చిన కరోనా చికిత్స అనుమతులను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.



రెండు, మూడు రోజుల్లో తనిఖీలు నిర్వహించి చికిత్సలు, ఫీజుల రికార్డులను పరిశీలించనుంది. కాసుల కక్కుర్తికి పాల్పడే ఆసుపత్రులపై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే…కరోనాతో ఓకే కుటుంబంలో ఉన్న ముగ్గురు చనిపోవడం, మానవత్వం మరిచి రూ. లక్షలు చెల్లించాలని ఓ ఆసుపత్రి డిమాండ్ చేయడం పెద్ద కలవరం రేపింది.

దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.  తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని..తక్షణమే చర్యలు తీసుకొనే విధంగా చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెలను కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్ నంబర్ కు ప్రైవేటు ఆసుపత్రులపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని, వీటన్నింటినీ పరిశీలిస్తున్నట్లు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.



వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు విచారణ చేపట్టి..నివేదిక ఇవ్వాలని వైద్య, ఆరోగ్య శాఖ జిల్లా డీఎంహెచ్ వోలను ఆదేశించింది. కొన్ని ఆసుపత్రులకు కరోనా చికిత్స చేసే వెసులుబాటు రద్దు చేయనుందని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే నోటీసులు జారీ చేశారని సమాచారం. కరోనా చికిత్స నిమిత్తం ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు భారీగా దోపిడికి పాల్పడుతున్నారని భావించి…ప్రభుత్వం గత నెల 9154 170960 వాట్సప్ నెంబర్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఒక పెద్ద కార్పొరేట్‌ ఆస్పత్రి అయితే ఒక వ్యక్తికి వైద్యం చేసినందుకు ఏకంగా రూ. 18 లక్షలకుపైగా బిల్లు వేసిందని, కొందరికి సాధారణ లక్షణాలున్నా ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి రూ. లక్షల్లో ఫీజు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కరోనా బాధితుడు కోలుకుంటున్నాడని, ఫీజు కింద మొత్తం రూ. 5 లక్షలు చెల్లిస్తే డిశ్చార్జి చేస్తామని..తీరా ఫీజు కట్టిన అనంతరం శవాన్ని అప్పగించారనే విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మొత్తానికి ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం కొరడా ఝులింపించడనికి రెడీ అయ్యింది.