వరద ప్రభావిత ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటన, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా

  • Published By: madhu ,Published On : October 17, 2020 / 12:02 PM IST
వరద ప్రభావిత ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటన, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా

Telangana Minister KTR : వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో వరదల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా అందించారు. వరదల వల్ల ప్రాణ నష్టం జరగడం బాధాకరమని, ప్రజలకు అవసరమైన రేషన్ కిట్లు, వైద్యం, ఇతర తక్షణ సదుపాయాలను కల్పించే దిశగా ప్రయత్నిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్.



పారిశుధ్యంపైన దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, అంటురోగాలు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి కేటీఆర్ వెంట విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్‌, ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో పాటు స్థానిక ప్రజాప్ర‌తినిధులు ఉన్నారు.

అదే విధంగా..గగన్ పహాడ్ లో కూడా మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఆయనతో పాటు హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు. గగన్ పహాడ్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతైనట్లు సమాచారం. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆదుకుంటామని, అధైర్యపడకూడదని భరోసానిచ్చారు.



వరద ప్రభావిత కాలనీలలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతామని, ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం షెల్టర్‌హోమ్‌లలో ఉన్న వారందరికీ ఆహారంతోపాటు దుప్పట్లు, మందులు అందిస్తున్నామని పేర్కొన్నారు.