నాగార్జునసాగర్ అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ వ్యూహాలు..ఆశావాహులను పక్కా ప్రణాళికతో సైడ్‌ చేస్తున్న కేసీఆర్‌

నాగార్జునసాగర్ ఉపఎన్నికను టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తుంది. ఆశావాహుల సంఖ్య ఆమాంతం పెరగడంతో.. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా గులాబీ బాస్‌ తెలివిగా ఒక్కోక్కరిని సైడ్‌ చేస్తున్నారు.

నాగార్జునసాగర్ అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ వ్యూహాలు..ఆశావాహులను పక్కా ప్రణాళికతో సైడ్‌ చేస్తున్న కేసీఆర్‌

Nagarjuna Sagar by-election : నాగార్జునసాగర్ ఉపఎన్నికను టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తుంది. ఆశావాహుల సంఖ్య ఆమాంతం పెరగడంతో.. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా గులాబీ బాస్‌ తెలివిగా ఒక్కోక్కరిని సైడ్‌ చేస్తున్నారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఖాళీ అయిన నాగార్జునసాగర్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఉపఎన్నిక షెడ్యూల్ రానప్పటికీ.. అన్నీ పార్టీలు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. అయితే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు అధికార టిఆర్ఎస్ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది.

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో అధికార టిఆర్ఎస్‌కు నాగార్జునసాగర్ ఉపఎన్నికలో విజయం సాధించడం చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి బరిలో నిలవడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో బలమైన అభ్యర్థిని పోటీలో నిలపాలని టిఆర్ఎస్ భావిస్తోంది. దుబ్బాకలో దివంగత శాసనసభ్యుడి భార్యను పోటీలో నిలిపినా ఓడిపోవడంతో.. నాగార్జునసాగర్ లో అదే ఫార్ములాను పాటించే విషయంలో అచితూచి వ్యవహరిస్తుంది. మరోవైపు ఆశావాహులందరిని గులాబీ బాస్ చాలా వ్యూహాత్మకంగా సైడ్ చేస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

మొదటి నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారిలో నోముల నర్సింహయ్య కొడుకు భగత్ యాదవ్.. ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి ఉండగా.. వారితో పాటు ఎంసీ కోటిరెడ్డి, రంజిత్ యాదవ్, రవీందర్ రెడ్డి కూడా టికెట్‌ ఆశిస్తున్నారు.. అయితే చిన్నపరెడ్డి, నోముల భగత్ అభ్యర్థిత్వాలనే ప్రధానంగా సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు ప్రచారమైంది. హాలియాలో నిర్వహించిన బహిరంగ సభకు చిన్నపరెడ్డిని.. కేసీఆర్‌ హెలికాప్టర్‌లో తీసుకురావడం ఉహాగానాలకు మరింత బలమిచ్చింది. దీంతో ఇతర ఆశావాహులందరూ వెనక్కి తగ్గి.. కొంతమంది తేరా చిన్నపరెడ్డికి మద్దతుగా.. మరికొంతమంది భగత్ కు మద్ధతుగా నిలుస్తున్నారు.

ఇక ఇద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ ఖాయం అనుకుంటున్న సమయంలో.. అనూహ్యంగా మరి కొన్ని పేర్లు తెరపైకి రావడం గులాబీ శిబిరంలో చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ స్వయంగా గురవయ్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్, మన్నెం రంజిత్ యాదవ్‌లతో ఫోన్లో మాట్లాడడంతో వారి పేర్లు అనూహ్యంగా ఆశావాహుల జాబితాలోకి చేరిపోవడమే కాక.. అందులో ఒకిరికి టికెట్ ఖాయం అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిన పేర్లన్ని ఒకే సామాజిక వర్గానికి చెందినవి కావడం విశేషం.

ఈ ప్రచారంతో నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా బీసీనే ఉంటారని టిఆర్ఎస్ అధిష్టానం లీకులిచ్చింది. ఈ ఒక్క లీకుతో ఇతర సామాజికవర్గానికి చెందిన ఆశావాహులకు తెలివిగా చెక్ పెట్టినట్లయిందనే టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు రేసులో భగత్ యాదవ్ తో పాటు అదే సామాజికవర్గానికి చెందిన ఇతరులు మాత్రమే ఆశావాహులుగా ఉన్నారు.

మరోవైపు స్థానికత అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి.. నోముల భగత్‌కు చెక్ పెట్టేందుకు వ్యతిరేక వర్గం ప్రయత్నిస్తోంది. అయితే ఇంత జరుగుతున్నా.. నోముల భగత్ కానీ.. నర్సింహయ్య అనుచరులు కానీ.. పెద్దగా స్పందిచకపోవడం కొత్త చర్చకు తావిస్తోంది. వీరికి గులాబీ బాస్‌ నుంచి ఏమైనా స్పష్టమైన ఆదేశాలున్నాయా? టాక్‌ నడుస్తోంది.. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం.. సాగర్ ఉపఎన్నిక అభ్యర్థిపై సీఎం కేసీఆర్‌ స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.