GHMC Unnecessary expenses : జీహెచ్‌ఎంసీలో అనవసర ఖర్చులు : ఫోన్ బిల్లుల కోసం కోట్లు కుమ్మరించారు

155 మంది.. 56 నెలలు.. మూడున్నర కోట్లు.. ఈ లెక్కలు ఇప్పుడు బల్దియా అధికారులకు చెమటలు పట్టిస్తున్నాయి

GHMC Unnecessary expenses : జీహెచ్‌ఎంసీలో అనవసర ఖర్చులు : ఫోన్ బిల్లుల కోసం కోట్లు కుమ్మరించారు

Ghmc Unnecessary Expenses

Unnecessary expenses in GHMC : 155 మంది.. 56 నెలలు.. మూడున్నర కోట్లు.. ఈ లెక్కలు ఇప్పుడు బల్దియా అధికారులకు చెమటలు పట్టిస్తున్నాయి. ఓవైపు టెలికాం కంపెనీలు పోటీపడి చార్జీలు తగ్గిస్తుంటే.. జీహెచ్‌ఎంసీకి మాత్రం అవి నచ్చడం లేదు. అందుకే కేవలం ఫోన్ బిల్స్ కోసమే ఏకంగా కోట్ల రూపాయలను కుమ్మరించారు. మరి ఆ లెక్కల సంగతేంటో ఓ లుక్కేయండి..

బల్దియా.. కాయా, పియా, చెల్దియా అనే నానుడిని కంటిన్యూ చేస్తున్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. నగరవాసులు ఎంతో కష్టపడి చెల్లించే పన్నులను తమ ఇష్టానుసారంగా ఖర్చు చేస్తుంది జీహెచ్ఎంసీ పాలకమండలి. తెలంగాణ ఏర్పడ్డాక 2016లో ఎన్నికైన నూతన పాలక మండలి వ్యవహారశైలి బల్దియా ప్రతిష్టను నవ్వుల పాలు చేసేలా ఉంది. ఐదేళ్లు అధికారంలో ఉన్న కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు టెలిఫోన్ బిల్లుల పేరుతో ఏకంగా 3 కోట్ల 47లక్షల రూపాయల ప్రజాధనాన్ని తమ ఖాతాల్లో వేసుకున్నారు.

జీహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు, ఐదుగురు కో ఆప్షన్ సభ్యులతో కలిపి మొత్తం 155 మంది ఉన్నారు. ఫోన్‌ బిల్లుల కోసం ఒక్కొక్కరికి 4 వేల చొప్పున నెలకు 6 లక్షల 20వేల రూపాయలను వారి ఖాతాల్లో వేసింది. 2016 జూన్ నుంచి 2021 జనవరి వరకు ఈ చెల్లింపులు ఆగలేదు. ఇలా 155 మందికి 56 నెలల్లో ఏకంగా 3 కోట్ల 47లక్షల 20 వేల రూపాయలు ఫోన్ బిల్లుల రూపంలో బల్దియా అధికారులు చెల్లించారు. ఒక్కో సభ్యుడు తన పదవీ కాలంలో ఫోన్ బిల్లు పేరుతో 2 లక్షల 24వేల రూపాయలు తీసుకున్నారు.

ఓవైపు టెలికాం కంపెనీలు పోటీపడీ మరీ చార్జీలు తగ్గిస్తూ చివరికి అన్‌లిమిటెడ్ ఆఫర్లు వరకు వచ్చాయి. అయినా బల్దియా అధికారులు నెలకు 4వేల రూపాయలు చెల్లించడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. నిజానికి గత పాలకమండలి కాలంలో ఇంత విలువైన చార్జీలు లేకపోవడం మరో విశేషం.

బల్దియా అధికారుల చర్యలపై కార్మిక నేతలు మండిపడుతున్నారు. ఇంటింటికి తిరిగి పన్ను వసూలు చేస్తున్న ఉద్యోగులను, నిత్యం రహదారులను శుభ్రపరిచే కార్మికులను పట్టించుకోని అధికారులు.. ఇన్ని డబ్బులు ఎలాచెల్లిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చర్యల కారణంగానే జీహెచ్‌ఎంసీ అప్పుల పాలవుతుందంటున్నారు.

ఓవైపు అభివృద్ధి మాటలు.. మరో వైపు ప్రజలపై ట్యాక్స్‌ల భారాలు పెంచుతున్న జీహెచ్ఎంసీ.. అనవసర ఖర్చులను నియంత్రించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అక్రమ మార్గాల్లో ప్రజాధనాన్ని లూటీ చేసే ఇలాంటి పనులు తగ్గించుకుంటే తప్ప జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడదని చెప్పకనే చెబుతున్నారు.