Vatte Janaiah Yadav: బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తానని చెప్పగానే.. వట్టే జానయ్యపై భూముల ఆక్రమణ కేసులు
వట్టే జానయ్య తమను బెదిరించి భూములు ఆక్రమించుకున్నాడంటూ సూర్యాపేట జిల్లా ఎస్పీని సుమారు 100 మంది బాధితులు కలిశారు.

Vatte Janaiah Yadav
Vatte Janaiah Yadav-BRS: బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో అసంతృప్తులు ఆ పార్టీ అధిష్ఠానంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తానని ఉమ్మడి నల్గొండ డీసీఎంఎస్ (DCMS) చైర్మన్ వట్టే జానయ్య ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 31న ఓ సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఈ సమయంలో ఆయనపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువలా వస్తుండడం చర్చనీయాంశంగా మారింది. వట్టే జానయ్య తమను బెదిరించి భూములు ఆక్రమించుకున్నాడంటూ సూర్యాపేట జిల్లా ఎస్పీని సుమారు 100 మంది బాధితులు కలిశారు. తమ భూములు తమకు ఇప్పించి న్యాయం చేయాలని అన్నారు.
మంత్రి జగదీశ్ రెడ్డికి వట్టే జానయ్య వ్యవహారం తలనొప్పిగా మారింది. ఆయనను ఇటీవల జగదీశ్ రెడ్డి దూరంగా ఉంచుతున్నారు. ఇంతకాలం జగదీష్ రెడ్డికి వట్టే జానయ్య సన్నిహితంగా ఉండడంతో ఫిర్యాదులు చేయడానికి బాధితులు ముందుకు రాలేదు.
జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… వట్టే జానయ్య యాదవ్ పై ఇప్పటి వరకు 36 మంది బాధితులు ఫిర్యాదులు చేశారని చెప్పారు. తమ భూములు ఆక్రమించారని కొందరు, నకిలీ దస్త్రాలతో మోసం చేశారని కొందరు ఫిర్యాదు చేశారని తెలిపారు. రెవెన్యూ అధికారులతో కలిసి దర్యాప్తు జరుపుతామని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.