కేంద్ర పథకాలకు వెల్ కమ్ ఎందుకు చెబుతున్నారు, కేసీఆర్ స్కెచ్ ఏంటీ ?

10TV Telugu News

KCR sketch : కేంద్ర పథకాలను తెలంగాణ‌లో అమ‌లుపై సీఎం కేసీఆర్ ఆలోచ‌న మారుతుందా..? నిన్న ఆయుష్మాన్ భారత్‌తో మొద‌లైన ప్రయాణం.. రేపు మ‌రిన్ని కేంద్ర పథ‌కాల‌కు బాట‌లు వేయ‌నుందా..? అసలు తెలంగాణ‌లో ఎంట్రీకి స‌సేమిరా అన్న గులాబి బాస్.. ఇప్పుడు ఎందుకు కేంద్ర పథ‌కాల‌కు వెల్ క‌మ్ చెబుతున్నారు..? ఇంత‌కు కేసీఆర్ నిర్ణయం వెన‌క మ‌త‌ల‌బేంటీ..? మోదీ ప్రభుత్వం తీసుకువ‌చ్చిన నోట్ల ర‌ద్దు లాంటి సంస్కర‌ణ‌కు బ‌హిరంగంగా మ‌ద్దతు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ తరువాత కేంద్ర పథ‌కాల‌కు మాత్రం నో చెబుతూ వచ్చింది.

ఆయుష్మాన్ భారత్ : –
దేశంలో ఎక్కడా లేని విధంగా.. సంక్షేమ పథ‌‌కాల‌ను అమ‌లు చేస్తున్న కేసీఆర్.. కొన్ని పథ‌కాల విష‌యంలో స‌సేమిరా అంటూ వచ్చారు. అయితే ఉన్నట్టుండి కేంద్ర పథ‌కం ఆయుష్మాన్ భారత్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ గతంలో ఈ పథ‌కం కంటే తెలంగాణలోని ఆరోగ్యశ్రీ వంద రెట్లు బెట‌ర్ అని ప‌లు సంద‌ర్భాల్లో కేసీఆర్ ప్రక‌టించారు. ఇప్పుడేమో ఆయుష్మాన్ భారత్‌ను ఆరోగ్య శ్రీ తో లింక్ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

ఢిల్లీ పర్యటన తర్వాత మారిన సీన్ : –
కేంద్రం తీసుకువ‌చ్చిన నూత‌న వ్యవ‌సాయ చ‌ట్టాల‌ను కూడా తీవ్రంగా వ్యవ‌తిరేకించారు కేసీఆర్. కానీ ఢిల్లీ పర్యటన తర్వాత సీన్ మారిపోయింది. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం. రైతులు ఇష్టం వ‌చ్చిన పంట వేసుకోవ‌చ్చని.. ఆ పంట‌ను మార్కెట్ బ‌య‌ట ఎక్కడైనా అమ్ముకోవ‌చ్చని చెప్పేశారు. కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని ప్రతిప‌క్షాలు ఎంతగా విమ‌ర్శలు చేసినా ప్రభుత్వం లైట్ తీసుకుంది.

ఖజానాకు తగ్గిన ఆదాయం : –
వీటితో పాటు పీఎం ఫసల్ బీమా, నూతన విద్యుత్ చట్టాలపై కూడా సీఎం కేసీఆర్ పున‌రాలోచ‌న చేస్తున్నట్లు తెలుస్తోంది. పీఎం ఫసల్ బీమా రాష్ట్రంలో అమలు చేస్తే.. విపత్తుల సమయంలో రైతులకు పరిహారం అందించేందుకు వీలు ఉంటుంది. అలాగే నూతన విద్యుత్ చట్టంతో విద్యుత్ భారం తగ్గే అవకాశముంది. క‌రోనా కార‌ణంగా.. రాష్ట్ర ఖ‌జానాకు ఆదాయం తగ్గిపోయింది. ఈ సమయంలో కేంద్ర పథ‌కాల‌ను అమ‌లు చేయ‌డం వ‌ల‌న ఆర్థిక‌ ప‌ర‌మైన ప్రయోజ‌నాలు రాష్ట్ర ఖ‌జానాకు చేకూర్చాలన్నది సర్కార్ ప్లాన్.

కేసీఆర్ స్కెచ్ : –
అయితే రాజ‌కీయంగా కూడా ఇవి ప్రయోజ‌కంగా మారుతుంద‌న్నదీ కేసీఆర్ వ్యూహంగా క‌నిపిస్తుంది. మొత్తానికి ఇలా కేంద్ర పథ‌కాల‌కు ప‌చ్చజెండా ఫార్ములాను కేసీఆర్ తెర మీద‌కు తీసుకువ‌చ్చార‌ట‌. అటు ఆర్థిక ప్రయోజ‌నంతో పాటు.. కేంద్రంతో ఘ‌ర్షణను దూరం చేసుకోవ‌డంతో.. తేడా వ‌స్తే ప్రజ‌ల ముందు బిజేపీని దోషిగా నిల‌బెట్టి రాజ‌కీయంగా సేఫ్ జోన్ లో ఉండ‌వ‌చ్చు అన్నది కేసీఆర్ స్కెచ్. మ‌రి పథ‌కాల‌పై కేసీఆర్ యూట‌ర్న్ ఫార్ములా ఏ మేర‌కు వ‌ర్కౌట్ అవుతుందో చూడాలి.